Last Updated:
కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. ఆవు, దూడను హతమార్చడంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీశాఖ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
ఏపీలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు సంవత్సరాల క్రితం అనేక జిల్లాల్లో సంచరిస్తూ ప్రజల్లో భయాందోళనలకు కారణమైన అదే పెద్దపులి మళ్లీ అదే ప్రాంతంలో కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా కాకినాడ జిల్లాలోకి అడుగుపెట్టిన పెద్దపులి ఒక ఆవు, దూడను హతమార్చిన ఘటనతో గ్రామాల్లో భయభ్రాంతులు నెలకొన్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మూడు సంవత్సరాల క్రితం కూడా కాకినాడ జిల్లాలోనే మొదటిసారిగా గుర్తుతెలియని జంతువు పశువులను చంపుతుండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనంతరం ఏర్పాటు చేసిన కెమెరాల్లో అది పెద్దపులిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత ఆ పులి ఒక్క జిల్లాలో కాకుండా దాదాపు ఆరు జిల్లాల మీదుగా నాలుగు నెలలకు పైగా సంచరిస్తూ పశువులను హతమార్చుతూ ముందుకు సాగింది. అప్పట్లో ఆ పులి సంచారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ ఘటన తర్వాత మూడేళ్ల పాటు ఆ ప్రాంతంలో పెద్దపులి జాడ కనిపించలేదు.
ఇప్పుడీ నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ మళ్లీ అదే జిల్లాలో పెద్దపులి ప్రత్యక్షమవడంతో ప్రజల్లో భయం మళ్లీ మొదలైంది. కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏలేశ్వరం సమీప ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. అడ్డతీగల మండలం వైపు నుంచి అడుగుపెట్టిన పులి మార్గమధ్యంలో ఒక ఆవు, దూడను చంపినట్లు సమాచారం. ప్రస్తుతం ఏలేశ్వరం మండలం పరిధిలోని మర్రివీడు, కంబాలపాలెం కొండ ప్రాంతాల్లో అది తలదాచుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
పెద్దపులి సంచారం నేపథ్యంలో ఏలేశ్వరం మండలంలోని తిరుమలి, తూర్పు లక్ష్మీపురం, రమణయ్యపేట, జే. అన్నవరం సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గ్రామాల్లో దండోరాలు వేయిస్తూ పులి సంచారం గురించి ప్రజలకు వివరించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చీకటి పడిన తర్వాత బయటకు వెళ్లకూడదని, పశువులను గ్రామాల శివార్లలో లేదా తోటల వద్ద కట్టకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.
ఇక ఈ పులి గతంలో తూర్పుగోదావరి జిల్లాలో సంచరిస్తూ ముప్పతిప్పలు పెట్టిన తర్వాత పట్టుబడి, తర్వాత వదిలిన పులేనా? లేక మరో కొత్త పులి ప్రాంతంలోకి ప్రవేశించిందా అన్నదానిపై కూడా చర్చ మొదలైంది. దీనిపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తూ గ్రామస్తులకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పెద్దపులి మళ్లీ ఇదే జిల్లాలో కనిపించడంతో అది మళ్లీ గతంలా జిల్లాల మీదుగా సంచరిస్తుందా అనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఏలేశ్వరం మండల పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర అప్రమత్తతతో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


