Telangana and AP Weather Forecast Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో మారనున్న వాతావరణం | తెలంగాణ వార్తలు


Last Updated:

AP and Telangana Weather Forecast Update: అసలే ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇలాంటి సమయంలో.. వాతావరణంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. దీనికి కారణం భూతాపమే. వేడి పెరిగే కొద్దీ.. వానలూ పెరుగుతాయి.

ఏపీ, తెలంగాణకు వర్ష సూచన! (Image credit - zoom.earth)
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన! (Image credit – zoom.earth)

ఆంధ్రప్రదేశ్ సముద్రం పక్కనే ఉండటం వల్ల.. బంగాళాఖాతంలో వచ్చే ప్రతీ మార్పూ.. ఏపీపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా మయన్మార్‌ లోని యాంగోన్‌కి పశ్చిమంగా 500 కిలోమీటర్ల దూరంలో.. ఒక పెద్ద ఆవర్తనం ఏర్పడింది. అది తెలంగాణ సైజులో ఉంది. ప్రస్తుతం దాని సుడి వేగం గంటకు 21 కిలోమీటర్లుగా ఉంది. అది క్రమంగా ఒడిశా, ఉత్తరాంధ్రవైపుగా వెళ్తూ ఉంది. అంటే మార్చి 9 నాటికి ఏపీ తీరానికి కాస్త దగ్గరగా వస్తుంది. అప్పుడు అది విశాఖపట్నానికి ఈశాన్యంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ తర్వాత కూడా అది అక్కడక్కడే తిరుగుతూ.. స్థిరంగా కొనసాగనుంది. అది అల్పపీడనంగా మారుతుందా అనేది అప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. ఐతే.. దాని ప్రభావం ఏపీపై ఎక్కువగా, తెలంగాణపై కొంత కనిపించవచ్చు.

ఇవాళ మార్చి 8న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భగభగ మండే ఎండలే ఉంటాయి. కానీ.. రాత్రి 8 తర్వాత ఉత్తరాంధ్రలో వాతావరణం మారుతుంది. ఉత్తరం వైపు నుంచి మేఘాలు దూసుకొస్తాయి. క్రమంగా అవి రాత్రంతా.. ఏపీ మొత్తం వ్యాపిస్తాయి. అలాగే ఉత్తర తెలంగాణలో కూడా అర్థరాత్రి సమయంలో మేఘాలు రావడం మొదలవుతుంది. 9వ తేదీన రోజంతా ఏపీ, తెలంగాణలో పలుచని మేఘాలు ఉంటాయి. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కురవవచ్చు. కానీ.. ఎక్కడా భారీగా వర్షాలు కురవవు. ఏపీలో 9వ తేదీన ఎండ కొంత తగ్గే ఛాన్స్ ఉంది. తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా మార్చి 9న జల్లులు పడవచ్చు. అది కూడా తక్కువగానే.

అంటార్కిటికా నుంచి భారీ ఎత్తున చలిగాలులు, మేఘాలూ.. భూమధ్య రేఖవైపు దూసుకొస్తున్నాయి. ఇవి హిందూ మహా సముద్రంపై ప్రయాణిస్తూ.. భూమధ్య రేఖను చేరడానికి 3 వారాల నుంచి 1 నెల పాటూ టైమ్ పడుతుంది. ఇలా అంతటా మేఘాలు ఉన్నా.. ఇండియాలో ఎండలు ఎక్కువగా ఉండటానికి కారణం గాలుల దిశే. అవి దక్షిణం నుంచి ఉత్తరానికి రావట్లేదు. అలా రావడానికి మరో 2 నెలలు పడుతుంది. అంటే.. మే నెలలో గాలుల దిశలో మార్పులు మొదలవుతాయి. ఆ తర్వాత జూన్ నుంచి వర్షాకాలం మొదలవ్వగలదు.

బంగాళాఖాతంలో ఆవర్తనం (Image credit – zoom.earth)

ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. సూర్యుడి నుంచి అత్యంత వేడి గాలులు భూమిని తాకుతున్నాయి. సౌర తుపాన్లు కూడా భూమిని వేడెక్కిస్తున్నాయి. అందువల్ల ఎండల తీవ్రత పెరుగుతోంది. ఐతే.. ఈ సంవత్సరం వానాకాలం కూడా తీవ్రంగానే ఉండనుంది. అందుకు కారణం కూడా సూర్యుడే. ఈ అతి వేడి సౌర తుపాన్ల వల్ల.. సముద్రాలపై భారీ ఎత్తున మేఘాలు పోగవుతున్నాయి. ఇవన్నీ నెక్ట్స్ 2 నెలలపాటూ.. స్టాక్ ఉంటాయి. మే నెలలో గాలులు సముద్రాల నుంచి నేలవైపు రాగానే.. మేఘాలు కూడా.. భూమివైపు రావడం మొదలవుతుంది. అంటే.. మనకు నైరుతీ రుతుపవనాలతో ఈ సంవత్సరం భారీ ఎత్తున మేఘాలు భూమివైపు వస్తాయి. ఫలితంగా భారీ వర్షాలు కురుస్తాయి. ఐతే.. ఇప్పుడు మాత్రం ఎండల తీవ్రత తప్పదు. గాలుల దిశ మారే వరకూ మనకు ఎండలే ఉంటాయి.

ఏపీ, తెలంగాణలో మారనున్న వాతావరణం (Image credit – zoom.earth)
రైతులకు అలర్ట్:

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు రేపు (మార్చి 9) కొంత అప్రమత్తంగా ఉండాలి. పొలాల్లో పంటలు ఉంటే.. వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి. మార్చి 9 తర్వాత.. వాతావరణంలో మార్పులు కొన్ని రోజులపాటూ కొనసాగవచ్చు. ఆవర్తనం ఇప్పట్లో తొలిగిపోయే పరిస్థితి లేదు. అది ఎన్ని రోజులు ఉంటుందో అప్పుడే తెలియదు. అది సముద్రంలో ఉన్నంతకాలం.. ఏపీలో వాతావరణ మార్పులు కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి.. రైతులు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

(ఈ సమాచారం జూమ్.ఎర్త్ డేటా ఆధారంగా ఇచ్చినది. పూర్తిగా వాస్తవాల ఆధారంగా ఇచ్చినది.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *