తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం.. ఇప్పుడు మంచి ఆదాయం.. యువకుడి ఐడియా అదుర్స్..! Puttaparthi youth Raja succeeds in photo framing business | అనంతపురం వార్తలు (Anantapuram News)


Last Updated:

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన రాజా ఫోటో ఫ్రేమింగ్ వ్యాపారంలో మంచి గుర్తింపు పొందారు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, నైపుణ్యంతో లాభాలు పొందుతున్నారు.

+

ఫోటో

ఫోటో ఫ్రెమ్ వర్కులో రానిస్తున్న పుట్టపర్తి కుర్రాడు…

పెళ్లిళ్లు, పుట్టినరోజులు, కుటుంబ వేడుకలు వంటి ఎన్నో మధుర జ్ఞాపకాలను పదిలంగా నిలుపుకోవాలంటే ఫోటోలు ఎంతో ముఖ్యమైనవి. ఆ ఫోటోలను అందంగా భద్రపరచడానికి ప్రజలు ఇప్పటికీ ఫోటో ఫ్రేమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాలం మారినా ఫ్రేమింగ్‌కు ఉన్న డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఈ అవకాశాన్ని సరిగ్గా గుర్తించి ఫోటో ఫ్రేమింగ్ వ్యాపారంలో మంచి గుర్తింపు పొందుతున్నాడు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చెందిన యువకుడు రాజా. చిన్న స్థాయిలో ప్రారంభించిన ఈ వ్యాపారం ఇప్పుడు మంచి ఆదాయం అందిస్తున్నదని ఆయన చెబుతున్నారు.

ప్రస్తుతం వ్యక్తిగతీకరించిన బహుమతులు ఇచ్చే సంస్కృతి పెరిగిందని రాజా చెబుతున్నారు. అందుకే ఫోటో ఫ్రేమ్‌లకు కూడా మంచి డిమాండ్ ఉందని ఆయన అంటున్నారు. గతంలో సాధారణ ఫ్రేమ్‌లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త డిజైన్‌లు, కొత్త స్టైల్‌లు వస్తున్నాయని వివరించారు. ఫోటో ఫ్రేమింగ్ వ్యాపారం ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో యంత్రాలు అవసరం లేదని, పనిపై నైపుణ్యం ఉంటే సరిపోతుందని రాజా తెలిపారు.

ఈ వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉపయోగించే మెటీరియల్‌పై ఆధారపడి ఉంటాయని ఆయన చెబుతున్నారు. గ్లాస్, చెక్క లేదా ఫైబర్ మోల్డింగ్స్, బోర్డుల ధర తక్కువగా ఉండటంతో మంచి మార్జిన్ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. కస్టమర్ కోరుకునే డిజైన్, పనితనాన్ని బట్టి సుమారు 30 నుంచి 50 శాతం వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. తన దగ్గర వంద రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు వివిధ ధరల్లో ఫోటో ఫ్రేమ్‌లు అందుబాటులో ఉన్నాయని రాజా వివరించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ట్రెండ్స్ కూడా మార్కెట్‌లోకి వచ్చాయని ఆయన తెలిపారు. పాతకాలపు ఫోటో ఫ్రేమ్‌లతో పాటు ఇప్పుడు కాన్వాస్ ప్రింటింగ్ ఫోటోలకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఫోటోలను పెయింటింగ్‌లా కనిపించేలా ప్రింట్ చేసి ఫ్రేమ్ చేసే విధానం ప్రస్తుతం ఎక్కువగా ట్రెండ్‌లో ఉందని అన్నారు. అలాగే వందల చిన్న ఫోటోలతో ఒక పెద్ద ఫోటో తయారు చేసే మొజాయిక్ ఫ్రేమ్‌లు కూడా చాలా మంది ఇష్టపడుతున్నారని చెప్పారు. ఆధునిక ఇళ్లకు, కార్యాలయాలకు సరిపోయే మినిమలిస్ట్ ఫ్రేమ్‌లు మరియు వెలుగుతూ కనిపించే ప్రత్యేక ఫోటో ఫ్రేమ్‌లు కూడా ప్రస్తుతం మార్కెట్‌లో మంచి ఆదరణ పొందుతున్నాయని తెలిపారు.

అయితే ఈ వ్యాపారంలో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయని రాజా చెబుతున్నారు. ఫ్రేమ్ ఫినిషింగ్ కచ్చితంగా నీట్‌గా ఉండాలి, కటింగ్ జాయింట్స్ పర్ఫెక్ట్‌గా లేకపోతే కస్టమర్లు తిరిగి రారని చెప్పారు. మరోవైపు ఆన్‌లైన్ వెబ్‌సైట్ల నుంచి కూడా గట్టి పోటీ ఉంటుందని తెలిపారు. అందుకే నాణ్యతతో పాటు వేగంగా డెలివరీ ఇవ్వడం కూడా చాలా ముఖ్యం అని చెప్పారు. ఈ వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని రాజా సూచిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చని, ఫ్రేమింగ్‌తో పాటు ఫోటో ప్రింటింగ్ కూడా కలిపి చేస్తే మరింత లాభం పొందవచ్చని అన్నారు. కస్టమర్ ఫోటో ఇచ్చిన వెంటనే ప్రింట్ తీసి ఫ్రేమ్ చేసి ఇవ్వడం ద్వారా ఒకే చోట పూర్తి సేవ అందించవచ్చని, ఇది కస్టమర్లకు సౌకర్యంగా ఉంటుందని రాజా తెలిపారు. ఫోటో ఫ్రేమింగ్ సేవల కోసం తనను సంప్రదించాలనుకునేవారు 7032030866 నంబర్‌లో సంప్రదించవచ్చని చెప్పారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *