యువతకు గుడ్ న్యూస్.. ఏపీలో ప్రపంచ స్థాయి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ పార్క్.. ఎక్కడంటే..? NSIHPAP Ltd shipbuilding project worth Rs 29662 crore in Nellore. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో 2,000 ఎకరాల్లో రూ.29,662 కోట్లతో NSIHP-AP Ltd. షిప్ బిల్డింగ్ & హెవీ ఇండస్ట్రీస్ పార్క్. 50:50 భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ.

News18
News18

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర సముద్ర రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో ప్రపంచ స్థాయి నౌకా నిర్మాణం, నౌకా మరమ్మత్తు మరియు అనుబంధ సముద్ర పరిశ్రమల అభివృద్ధి కోసం “షిప్ బిల్డింగ్ & హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (NSIHP-AP Ltd.)” పేరుతో ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం రాష్ట్ర సముద్ర రంగానికి పెద్ద ఊతాన్ని ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రంగా నిలబెట్టే దిశగా కీలకంగా మారనుంది.

ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు మరియు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సంయుక్తంగా అమలు చేయనున్నాయి. రెండూ 50:50 నిష్పత్తిలో భాగస్వామ్యంగా ఉండే ప్రత్యేక ప్రయోజన వాహక సంస్థ (SPV) ద్వారా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ Shipbuilding Financial Assistance Policy (SBFA) పథకం కింద ఈ ప్రాజెక్టు అమలుకానుండగా, వ్యూహాత్మకంగా ఒక ప్రముఖ షిప్‌యార్డ్ భాగస్వామిని ఎంపిక చేయనున్నారు.

దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్ దేశంలోని నౌకా నిర్మాణ మరియు మరమ్మత్తు రంగానికి కొత్త ఊపును తీసుకురానుంది. అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు పెద్ద ఎత్తున ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించబడనున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత పారిశ్రామికీకరణకు ఇది కొత్త దిశను చూపనుందని అధికారులు చెబుతున్నారు.

సుమారు రూ.29,662 కోట్ల అంచనా వ్యయంతో నెల్లూరు జిల్లాలో 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు అభివృద్ధి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 974 కిలోమీటర్ల విస్తారమైన తీరరేఖను వినియోగించుకుంటూ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) పెరుగుదలకు కూడా గణనీయంగా తోడ్పడనుంది.

ఈ సమగ్ర సముద్ర పరిశ్రమ కేంద్రంలో నాలుగు డ్రై డాక్స్, ఆధునిక షిప్ లిఫ్ట్ సదుపాయాలు మరియు అత్యాధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. సంవత్సరానికి 1.2 మిలియన్ గ్రాస్ టన్నేజ్ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని సృష్టించే విధంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఇది దేశంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి కూడా మరింత బలం చేకూర్చనుంది.

ఇక ఈ ప్రాజెక్టు ద్వారా నౌకా భాగాల తయారీదారులు, సముద్ర పరికరాల సరఫరాదారులు, లాజిస్టిక్స్ సేవల సంస్థల నుంచి రూ. 8,000 నుంచి రూ.10,000 కోట్ల వరకు అనుబంధ పెట్టుబడులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాంతీయ పరిశ్రమలకు లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గడంతో పాటు తయారీ, వాణిజ్యం మరియు ఎగుమతుల పోటీ సామర్థ్యం పెరుగుతుందని భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడంలో విశాఖపట్నం పోర్ట్ చైర్‌పర్సన్ డా. ఎం. అంగముత్తు ఐఏఎస్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీర ప్రాంత అభివృద్ధికి తోడ్పడడంతో పాటు యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను అందించే దిశగా కీలకంగా మారనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *