AP Assembly: జగన్ క్రిస్టియన్ కాబట్టే, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ.. ఏపీ అసెంబ్లీలో సంచలనం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

సభలో ప్రధానంగా తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై చర్చ జరిగింది. అధికార పక్ష సభ్యులు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలన కాలంలోనే తిరుమలలో అపవిత్రతకు దారితీసే పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.

Tirumala Laddu Ghee Controversy Sparks Uproar in AP Assembly Heated Debate Over Jagan Religion
Tirumala Laddu Ghee Controversy Sparks Uproar in AP Assembly Heated Debate Over Jagan Religion

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ నెయ్యి వివాదం పెద్ద చర్చకు దారితీసింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై తీవ్ర వాగ్వాదాలతో గందరగోళంగా మారాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో చైర్మన్ సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

సభలో ప్రధానంగా తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై చర్చ జరిగింది. అధికార పక్ష సభ్యులు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలన కాలంలోనే తిరుమలలో అపవిత్రతకు దారితీసే పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి మతంపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీనికి ప్రతిగా ప్రతిపక్ష సభ్యులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే తిరుమల లడ్డూ నెయ్యి నాణ్యతపై వివాదాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. దీంతో సభలో ఆరోపణలు, ప్రతియారోపణలు తీవ్రంగా కొనసాగాయి.

ఈ సమయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పదేపదే జగన్ మోహన్ రెడ్డిని క్రిస్టియన్ అని సంబోధించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. మంత్రి సభకు క్షమాపణ చెప్పాలని వారు పట్టుబట్టారు. ఈ క్రమంలో వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేయడంతో సభలో ఉద్రిక్తత పెరిగింది. సభలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చైర్మన్ మోషేన్ రాజు పలుమార్లు సభ్యులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం ఆగకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇదిలా ఉండగా మండలి లాబీలో కూడా వైసీపీ ఎమ్మెల్సీల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మరియు ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మధ్య వాయిదా తీర్మానం అంశంపై మాటల తూటాలు పేలాయి. వరుదు కల్యాణి పేరుతో వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ ఆమె సభకు ఆలస్యంగా రావడంపై అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా తన పేరిట తీర్మానం ఇస్తున్న విషయాన్ని ముందుగా తెలియజేయలేదని కల్యాణి ప్రశ్నించారు.

ఇక అసెంబ్లీ కార్యకలాపాలపై కూడా రాజకీయ విమర్శలు వినిపించాయి. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభకు హాజరుకాకుండానే కొంతమంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన జీతాన్ని స్వీకరించడం లేదని స్పీకర్ వెల్లడించారు.

అదేవిధంగా జగన్ కోరుతున్న ప్రతిపక్ష హోదా అంశంపై కూడా స్పీకర్ స్పష్టత ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం జరిగే మండలి సమావేశాల్లో ఇదే అంశంపై మరోసారి హంగామా కొనసాగుతుందా లేక సభ సజావుగా సాగుతుందా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *