Last Updated:
సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం లో డోలోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈవో జె.వెంకటరావు దంపతులు ఉత్సవంలో పాల్గొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం లో మంగళవారం నిర్వహించిన డోలోత్సవం (పెళ్లిచూపులు) ఆధ్యాత్మిక ఉత్సాహంతో అంగరంగ వైభవంగా సాగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఉదయం నాలుగు గంటలకు మెట్ల మార్గం ద్వారా బోయీలు స్వామిని కొండ దిగువకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి స్వామివారు నేరుగా తన సోదరి పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకోవడం విశేషంగా నిలిచింది.
అమ్మవారి దర్శనం అనంతరం తన కుమార్తెను వివాహం చేసుకోవాలనే అభ్యర్థనను స్వామివారు తెలియజేసినట్టు ఆచార ప్రకారం నిర్వహించారు. ఆలోచించి చెబుతానని అమ్మవారు సంకేతం ఇచ్చినట్లుగా భావిస్తూ స్వామివారు గ్రామమధ్యంలోని పుష్కరిణి సత్రానికి చేరుకుని ఉయ్యాలలో ఆసీనులయ్యారు. అక్కడ డోలిలో విశేష పూజలు, వసంతోత్సవం, చూర్ణోత్సవం ఘనంగా జరిగాయి. అనంతరం గ్రామ తిరువీధిలో స్వామివారి విహారం భక్తుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మంగళహారతులతో గ్రామ ప్రజలు స్వామిని ఆహ్వానించారు.
మరోసారి పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకున్న స్వామివారు వివాహ ప్రతిపాదనను మళ్లీ తెలియజేయగా అంగీకారం లభించినట్లు ఆచారాలు సూచించాయి. దీంతో స్వామివారి వివాహం ఖరారైన సందర్భంలో అర్చక వర్గాలు, అధికారులు, ఉద్యోగులు, భక్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణం ఆనందోత్సాహాలతో మార్మోగింది.
ఈ వేడుకల్లో దేవస్థానం ఈవో జె.వెంకటరావు దంపతులు పాల్గొనగా, ఏఈవోలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈవో జె.వెంకటరావు ఆధ్వర్యంలో ఉత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. డోలిలో కొలువైన స్వామివారి దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని ఆలయ స్థానాచార్యులు టీపీ రాజగోపాల్ తెలిపారు.
సింహాద్రినాథుడి పెళ్లిరాట ఉగాది పర్వదినం రోజున వేయనుండగా, అదే రోజు పెళ్లికొడుకు అలంకరణ జరగనుంది. చంద్రగ్రహణం సందర్భంగా తెల్లవారుజామున ఎనిమిది గంటల లోపే అన్ని ఉత్సవాలు పూర్తి చేయడం విశేషం. ఆధ్యాత్మిక ఆనందం, సంప్రదాయ వైభవం, భక్తుల కేరింతలు ఇలా అన్నీ కలిసి సింహాచలం డోలోత్సవాన్ని మరోసారి చిరస్మరణీయంగా నిలిపాయి. భక్తుల హృదయాల్లో సింహాద్రినాథుడి పెళ్లిచూపులు ప్రత్యేక ముద్ర వేశాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh


