Last Updated:
తూర్పుగోదావరి జిల్లాలో రంగంపేట దొడ్డిగుంటలో నాగేంద్రను భార్య, శివ కలిసి హత్య చేయగా, శివ పురుగుమందు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
తూర్పుగోదావరి జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న పరువు హత్యలు, ప్రేమహత్యలు ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి. తెల్లవారుజామున డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తున్న యువతి ప్రేమవివాహం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఆమె భర్తను అన్నదమ్ములు హతమార్చిన ఘటన ఇంకా మదిలో నుంచే పోలేదు. ఆ సంఘటన మరువకముందే అదే జిల్లాలో మరో దారుణం చోటుచేసుకోవడం స్థానికులను కలవరపెడుతోంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ భర్తను.. భార్య ప్రియుడితో కలిసి దారుణంగా హతమార్చగా, అనంతరం అదే వ్యక్తి పురుగుమందు సేవించి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన సంచలనంగా మారింది.
ప్రశాంతతకు మారుపేరుగా పేరొందిన తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవలి కాలంలో ఇలాంటి హత్యలు వరుసగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన నాగేంద్ర తన భార్యతో కలిసి నివసిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తితో నాగేంద్ర భార్యకు కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం కారణంగా నాగేంద్ర దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది.
తాజాగా నాగేంద్ర తన భార్య శివతో కలిసి ఉండటాన్ని ప్రత్యక్షంగా చూసి ఆగ్రహానికి గురయ్యాడు. ఈ విషయంపై జరిగిన వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన శివ ఇనుప రాడ్డులతో నాగేంద్రపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నాగేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దాడి సమయంలో శివకూ గాయాలు కావడంతో పాటు, అనంతరం అతడు పురుగుమందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ హత్యలో నాగేంద్ర భార్య పాత్ర కూడా ఉందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని రంగంపేట సీఐ సుమంత్ తెలిపారు. నిందితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాలో ఇలాంటి దారుణ ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


