Indradhanusu Scheme: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏపీలో కొత్త పథకం.. అర్హతలు ఇవే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Indradhanusu Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. మంచి విషయమే. అయితే.. కొన్ని అర్హతలు ఉండి తీరాలి. ఆ వివరాలు తెలుసుకుందాం.

Rapid Read
దివ్యాంగులకు శుభవార్త!
దివ్యాంగులకు శుభవార్త!

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకం (స్త్రీ శక్తి పథకం) బాగా అమలవుతోంది. ఐతే.. దీన్ని దివ్యాంగులకు కూడా వర్తింపజేస్తే బాగుంటుందని చాలా మంది చెబుతూ ఉండటంతో.. ప్రభుత్వం కొన్ని సమాలోచనలు జరిపి.. చివరకు ఈ దిశగా ముందడుగు వేసింది. ఇంద్రధనస్సు అనే కొత్త పథకం తెచ్చింది. దీని ప్రకారం.. దివ్యాంగులు (వైకల్యం ఉన్నవారు) ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సహా 5 రకాల బస్సుల్లో ఫ్రీ జర్నీ చెయ్యవచ్చు అని ప్రభుత్వం చెప్పింది. ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ బడ్జెట్ ప్రకటనలో ఈ పథకాన్ని ప్రకటించగా, ఇటీవల రాష్ట్ర కేబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకు ముందు 50శాతం రాయితీ మాత్రమే ఉన్న దివ్యాంగులకు ఇప్పుడు స్త్రీ శక్తి పథకం తరహాలో పూర్తి సబ్సిడీ అందించనున్నారు. మరి అర్హతలేంటో చూద్దాం.

ఇంద్రధనస్సు పథకానికి అర్హతలు:

– ఈ పథకం పొందాలంటే తప్పనిసరిగా సదరం క్యాంప్ సర్టిఫికెట్ ఉండాలి. సాధారణంగా ఇది దివ్యాంగుల దగ్గర ఉంటుంది. ఈ సర్టిఫికెట్ చూపించి.. ఉచితంగా ప్రయాణించవచ్చు.

– వైకల్యం ఎంత ఉండాలి అనేది మరో ప్రశ్న. ప్రభుత్వం వైకల్యం కనీసం 40 శాతం ఉండాలని చెప్పింది. అందువల్ల 40 శాతం, అంతకంటే ఎక్కువ శాతం ఉన్నవారు ఉచితంగా ప్రయాణించవచ్చు.

– సదరం క్యాంప్ సర్టిఫికెట్ లేకపోతే, వైకల్యాన్ని నిరూపించే మరేదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరి.

– ఫొటో గుర్తింపు కార్డుగా ఆధార్, ఓటర్ ID వంటివి కూడా వెంట తీసుకెళ్లారు. తద్వారా ప్రయాణ సమయంలో కండక్టర్ అడిగితే చూపించవచ్చు.

ఏ 5 రకాల బస్సుల్లో 100శాతం ఉచితం?:

1. పల్లెవెలుగు (Pallevelugu)

2. అల్ట్రా పల్లెవెలుగు (Ultra Pallevelugu)

3. మెట్రో ఎక్స్‌ప్రెస్ (Metro Express)

4. ఎక్స్‌ప్రెస్ (Express)

5. సిటీ ఆర్డినరీ (City Ordinary)

ఈ ఐదు బస్సుల్లో పూర్తి ఉచిత ప్రయాణం చెయ్యవచ్చు.

ప్రీమియం బస్సుల్లో ఏమవుతుంది?:

నాన్-స్టాప్, అంతర్రాష్ట్రీయ బస్సులు, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్ లాంటి సర్వీసుల్లో 50 శాతం రాయితీ కొనసాగుతుంది.

ప్రయోజనాలు:

ఈ పథకం ద్వారా లక్షల మంది దివ్యాంగులు విద్య, ఉద్యోగం, వైద్యం, కుటుంబ అవసరాల కోసం ఎక్కడికైనా ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లడం చాలా సులభం అవుతుంది. సామాజిక సమానత్వం, సాధికారతకు ఇది ఒక మైలురాయి. అలాగే బస్సుల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక సీట్లు ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకొని.. సురక్షితంగా ప్రయాణించవచ్చు.

అమలు ఎప్పటి నుంచి?:

ఈ పథకాన్ని కేబినెట్ ఆమోదింది. అందువల్ల అధికారిక జీఓ (Government Order) త్వరలో వెలువడనుంది. జీఓ వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో అమలు మొదలవుతుంది. అందువల్ల సదరం సర్టిఫికేట్ ఉన్నవారు దీని ప్రయోజనం పొందేందుకు సిద్ధంగా ఉండవచ్చు. ఈ పథకం దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిద్దాం!

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *