Last Updated:
CM Chandrababu: మార్కాపురం జిల్లాలో చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం తొలిసారి పర్యటించి, ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేసిన తర్వాత సీఎం ఇక్కడ అడుగుపెట్టడంతో ప్రజలు, కూటమి నేతలు విశేషంగా స్పందించారు. హెలిప్యాడ్ వద్ద మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దోర్నాల మండలం గంటావానిపాలెం వద్ద సుమారు రూ.456 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు.
అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి జనవరిలోనే నూతన జిల్లాను ఏర్పాటు చేశామని, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టును కూడా శరవేగంగా పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు స్థానికంగా ఉన్న తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన అనంతరం మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన ‘ప్రజావేదిక’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రాజెక్టు పనులను గాలికొదిలేసి కేవలం రిబ్బన్ కటింగ్ లతో కాలయాపన చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
దశాబ్దాలుగా నత్తనడకన సాగుతున్న వెలిగొండ ప్రాజెక్టు పనులను 2014-2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వమే పరుగులు పెట్టించిందని ఆయన గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రాజెక్టును పూర్తి చేసి పశ్చిమ ప్రకాశం ప్రజల దాహార్తిని తీర్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని స్పష్టం చేశారు. మార్కాపురం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించామని, త్వరలోనే రక్షిత మంచినీటిని అందించి ప్రజల ఆరోగ్యాలను కాపాడతామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు నదుల అనుసంధానమే ఏకైక మార్గమని సీఎం ఉద్ఘాటించారు. ప్రతి సంవత్సరం గోదావరి నుంచి సుమారు 6 వేల టీఎంసీలు, కృష్ణా నది నుంచి 1500 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని, ఆ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
వాస్తవానికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి కేవలం 53 టీఎంసీల నీరు మాత్రమే అవసరమని, దీనిని సాధించడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదని ఆయన వివరించారు. నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో ఏ మూలకూ సాగు, తాగునీటి కొరత రాని విధంగా శాశ్వత కరువు నివారణ సాధ్యమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
మార్కాపురాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఉద్యానవనంగా మారుస్తానని ముఖ్యమంత్రి ఈ సభ ద్వారా ప్రజలకు భరోసా కల్పించారు. కేవలం నీటి ప్రాజెక్టులకే పరిమితం కాకుండా, ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామన్నారు.
వెనుకబడిన మార్కాపురం ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం వద్ద స్పష్టమైన విజన్ ఉందని ఆయన తెలిపారు. ఈ చారిత్రాత్మక పర్యటన ద్వారా అటు సాగునీటి ప్రాజెక్టుకు నిధులు కేటాయించడమే కాకుండా, నూతన జిల్లా సమగ్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయడంతో స్థానిక ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



