Last Updated:
ఆరిలోవలో వరుస హత్యలు, దుర్గ హత్యలో భర్త దేముడు అరెస్ట్, స్థానికులు భయాందోళనలో, పోలీసులు గస్తీ పెంచి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
విశాఖపట్నం ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యా ఘటనలు చోటుచేసుకుంటుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 11వ తేదీన మహిళ హత్య–దోపిడీ కేసు సంచలనం సృష్టించగా, ఆ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించి ఊపిరి పీల్చుకునేలోపే మరో మహిళ హత్య ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపింది. మంగళవారం ఉదయం ఆరిలోవ 11వ వార్డు అన్నానగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
ఆరిలోవ బాలాజీ నగర్ సమీపంలోని అన్నానగర్‌లో బురదపాటి దేముడు, దుర్గ దంపతులు కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. జీవనోపాధి కోసం ఇద్దరూ నగరంలోని ఒక బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. సాధారణంగా ప్రతిరోజూ విధులకు వెళ్లే దుర్గ మంగళవారం ఉదయం పనికి రాకపోవడంతో సహోద్యోగులు ఆమెకు ఫోన్ చేశారు. పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన సహోద్యోగులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి చూడగా దుర్గ మెడపై గాయాలతో అచేతనంగా పడిఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే మృతురాలి తండ్రి కె. నరసింహులు ఆరిలోవ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటిని పరిశీలించిన పోలీసులు గాలింపు చేపట్టగా మృతురాలి భర్త దేముడు ఫ్రిడ్జ్ వెనుక దాక్కుని ఉండటం గమనించి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో దేముడు నిజాన్ని ఒప్పుకున్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, అనుమానం కారణంగా ఆగ్రహానికి లోనై చున్నీతో మెడ బిగించి హత్య చేసినట్లు తెలిపాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆరిలోవ సీఐ హెచ్. మల్లేశ్వరరావు వెల్లడించారు.
ఇటీవలి కాలంలో వరుస హత్యా ఘటనలు చోటుచేసుకోవడంతో ఆరిలోవ ప్రాంత ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక కేసు మిస్టరీ వీడకముందే మరో హత్య వెలుగులోకి రావడం స్థానికుల్లో ఆందోళనను మరింత పెంచింది. పోలీసులు గస్తీని పెంచి పరిస్థితిని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh



