Sorakaya Swamy Temple Narayanavanam: సొరకాయలే నైవేద్యం, మొక్కు చెల్లించేది వాటినే.. కోరిన కోర్కెలు తీర్చే స్వామి మహిమ సీక్రెట్..! |


Last Updated:

Sorakaya Swamy Temple: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన నారాయణవనం ప్రాంతంలో భక్తులను ఆశ్చర్యపరిచే ఒక విశిష్ట ఆచారం ఉంది. సాధారణంగా దేవాలయాల్లో నైవేద్యంగా పండ్లు, మిఠాయిలు లేదా ఇతర పదార్థాలు సమర్పిస్తారు.

Rapid Read
+

Sorakaya

Sorakaya Swamy Temple

Sorakaya Swamy Temple: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన నారాయణవనం ప్రాంతంలో భక్తులను ఆశ్చర్యపరిచే ఒక విశిష్ట ఆచారం ఉంది. సాధారణంగా దేవాలయాల్లో నైవేద్యంగా పండ్లు, మిఠాయిలు లేదా ఇతర పదార్థాలు సమర్పిస్తారు. అయితే ఇక్కడ ఉన్న సొరకాయల స్వామి దేవాలయంలో మాత్రం భక్తులు సొరకాయలనే నైవేద్యంగా సమర్పించడం ప్రత్యేకత. కోరికలు తీరితే లేదా కోరికల కోసం మొక్కులు పెట్టుకునే భక్తులు సొరకాయలు సమర్పిస్తూ స్వామి అనుగ్రహం కోరుతారు. ఈ ఆలయం కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వరస్వామి పద్మావతి అమ్మవారి కల్యాణం జరిగిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన నారాయణవనంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉండటం మరింత విశిష్టతను కలిగిస్తోంది.

స్థలపురాణం..

స్థలపురాణం ప్రకారం 1875 ప్రాంతంలో సొరకాయను భుజానికి వేసుకుని రెండు శునకాలతో గ్రామంలో తిరుగుతూ భిక్షాటన చేసిన అవధూతుడే సొరకాయల స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఆయన పసుపు, వేప వంటి ఔషధాలతో గ్రామ ప్రజల అనారోగ్యాలను నయం చేసేవారని, చేతబడులు, క్షుద్రపూజల ప్రభావాన్ని తగ్గించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని భక్తుల విశ్వాసం. ఎక్కడి నుంచి వచ్చారో స్పష్టమైన ఆధారాలు లేకపోయినా కొందరు ఆయన చెన్నై ప్రాంతం నుంచి వచ్చారని భావిస్తారు. సొరకాయ బుర్రను పాత్రగా ఉపయోగిస్తూ సేవ చేస్తూ ప్రజలకు అండగా నిలిచిన ఆయన 1902 శ్రావణ మాసం గరుడ పంచమి రోజున జీవ సమాధి చెందినట్లు చెబుతారు. అనంతరం గ్రామస్తులే సమాధి వద్ద ఆలయం నిర్మించి పూజలు ప్రారంభించారు. స్వామి ఎంతకాలం జీవించారన్న దానిపై స్పష్టత లేకపోయినా స్థలపురాణం ప్రకారం ఆయన అనేక దశాబ్దాల పాటు జీవించి ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా నిలిచారని విశ్వసిస్తారు.

ఈ సమాధి ఆలయంలో మరో విశేషం ఏమిటంటే..

జీవ సమాధి జరిగిన నాటి నుంచి నిరంతరంగా వెలుగుతున్న అఖండ ధుని. 24 గంటలు, 365 రోజులు ఆ అగ్నిగుండం వెలుగుతూనే ఉండటం భక్తులను ఆకట్టుకుంటుంది. భక్తులు మొక్కుల రూపంలో అవసరమైన సామగ్రిని సమర్పిస్తూ ఈ ధుని కొనసాగిస్తుంటారు. హోమగుండం నుంచి వచ్చే విభూతిని అనేక రోగాలకు ఔషధంలా భావించి వినియోగిస్తారు. అలాగే మానసిక ఆందోళనలు, దుష్టశక్తుల ప్రభావం ఉందని నమ్మే వారిని అమావాస్య, పౌర్ణమి రోజుల్లో జరిగే ప్రత్యేక “బుట్ట పూజ”లో కూర్చోబెడతారు. ఆ రోజుల్లో ఆలయంలో రాత్రి విశ్రాంతి తీసుకుంటే సమస్యలు తగ్గుతాయని భక్తుల నమ్మకం.

భక్తుల సందర్శనార్ధం..

ఇంతటి మహిమాన్వితమైన ఆలయానికి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామి విగ్రహంతో పాటు ఆయన జీవ సమాధి, ఉపయోగించిన సొరకాయ బుర్ర, పాదరక్షలు, వస్త్రాలు వంటి పూజా వస్తువులు కూడా ఆలయంలో భక్తుల దర్శనార్థం ఉంచడం ఈ క్షేత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *