Last Updated:
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మృతిచెందిన ఘన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు సేవించి నలుగురు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నగరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, లాలచెరువు తదితర ప్రాంతాలకు చెందిన పలువురు అనధికారిక వ్యాపారి విక్రయించిన పాలు తాగడం వల్లే ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వర్చువల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య, ఫుడ్ సేఫ్టీ అధికారులతో పరిస్థితిని సమీక్షించిన సీఎం బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పాలు విక్రయించిన నాగేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ప్రాణాలతో చెలగాటమాడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తక్షణమే క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు.
కల్తీ పాలనఘటనపై అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ ప్రకటన..
పాలు, ఇతర ఆహార పదార్థాల కారణంగా అనారోగ్యం 106 కుటుంబాల నుంచి శాంపిల్స్ సేకరించాం.. వరలక్ష్మీ మిల్క్ డెయిరీ నుంచి పాలు సరఫరా అయ్యాయి.. పాల డెయిరీలో శాంపిల్స్ సేకరించాం : మంత్రి సత్యకుమార్#SatyaKumarYadav #APassembly… pic.twitter.com/okdE4fGu9u
— Telugu Stride (@TeluguStride) February 23, 2026
క్షేత్రస్థాయిలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానికంగా ప్రత్యేక వైద్య శిబిరాలు, ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానిత లక్షణాలున్న డెబ్బై మూడు మంది నుంచి ఇప్పటికే రక్త నమూనాలు సేకరించగా, మిగిలిన వారి నుంచి కూడా నమూనాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. మరో ఎనిమిది మంది నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
మరణాలకు అసలు కారణం తెలుసుకునేందుకు పాల నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ప్రయోగశాలలకు పంపించారు. ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విక్రయదారుడిపై సెక్షన్ 194 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరంలోని ఘటనా స్థలానికి చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ ల్యాబ్ నుంచి పరీక్ష ఫలితాలు రాగానే కల్తీకి పాల్పడిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయి అధికారిక విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోవైపు కల్తీ పాల మరణాలపై ప్రతిపక్ష నాయకులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠినాతి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని మంత్రులు భరోసా కల్పించారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి విషాదకర సంఘటనలు భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడా పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం హామీ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



