Last Updated:
పలమనేరు మీదుగా చెన్నై – బెంగళూరు బుల్లెట్ రైలు, బెంగళూరు – విజయవాడ హైస్పీడ్ కారిడార్‌తో అత్యాధునిక రైల్వే స్టేషన్ ఏర్పాటుకు NHSRCL ప్రణాళికలు వేగంగా సాగుతున్నాయి.
పలమనేరు పట్టణ భవిష్యత్తు
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ చిత్తూరు జిల్లాలోని కీలక పట్టణమైన పలమనేరు ముఖచిత్రం త్వరలో పూర్తిగా మారిపోనుంది. దశాబ్దాలుగా రైల్వే కూతకు దూరంగా ఉన్న ఈ పట్టణానికి, ఇప్పుడు ఏకంగా బుల్లెట్ రైలు వేగంతో కూడిన అభివృద్ధి రాబోతోంది. బెంగళూరు – విజయవాడ హైస్పీడ్ రైల్వే కారిడార్‌తో పాటు చెన్నై – బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్టులు పలమనేరు మీదుగా వెళ్తుండటంతో, ఇక్కడ ఒక అత్యాధునిక రైల్వే స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు వేగంగా సిద్ధమవుతున్నాయి. వందేళ్లుగా రైలు మార్గం కోసం ఎదురుచూస్తున్న పలమనేరు వాసుల కల ఇప్పుడు నెరవేరబోతోంది.
భౌగోళికంగా పలమనేరు పట్టణం బెంగళూరు, చెన్నై, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు మధ్యలో ఉంటుంది. ఇప్పటివరకు ఇక్కడి ప్రజలు రైలు ప్రయాణం చేయాలంటే సుమారు 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం లేదా చిత్తూరు రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సి వచ్చేది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) పర్యవేక్షణలో రూపొందుతున్న చెన్నై – బెంగళూరు – మైసూరు బుల్లెట్ రైలు కారిడార్ సుమారు 435 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఇందులో చిత్తూరు జిల్లా గుండా వెళ్లే 77 కిలోమీటర్ల మార్గంలో పలమనేరు అత్యంత కీలకమైన స్టేషన్‌గా మారనుంది.
పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాలు వ్యవసాయానికి, పాడి పరిశ్రమకు ప్రసిద్ధి. ఇక్కడ పండే మామిడి, టమాటో, ఆకుకూరలు, కూరగాయలకు చెన్నై, బెంగళూరు మార్కెట్లలో మంచి గిరాకీ ఉంది. రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే అత్యంత తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పంటలను మహానగరాలకు తరలించవచ్చు.
పలమనేరు ఇప్పటికే గ్రానైట్ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. హైస్పీడ్ రైలు మార్గం వల్ల భారీ పరిశ్రమలు తరలివచ్చే అవకాశం ఉంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో లాజిస్టిక్ హబ్‌లు, గోదాములు వాణిజ్య కేంద్రాలు ఏర్పడి స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది.
ఈ హైస్పీడ్ కారిడార్‌లో రైళ్లు గంటకు 320 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ట్రాక్‌లను రూపకల్పన చేస్తున్నారు. అంటే పలమనేరు నుంచి బెంగళూరుకు లేదా చెన్నైకి కేవలం నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. ఇది విద్యార్థులకు, వైద్య అవసరాల కోసం వెళ్లే వారికి మరియు ఉద్యోగులకు ఒక వరంగా మారనుంది.
కేవలం రైల్వే మాత్రమే కాకుండా, బెంగళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే కూడా పలమనేరు సమీపంలోని బైరెడ్డిపల్లె, వి.కోట మీదుగా వెళ్తోంది. అటు హైవే, ఇటు బుల్లెట్ రైలు మార్గం.. ఈ రెండింటి కలయికతో పలమనేరు ఒక పారిశ్రామిక హబ్‌గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బెంగళూరు – విజయవాడ కారిడార్ తోడైతే, రాయలసీమ, కోస్తా ఆంధ్ర మధ్య పలమనేరు ఒక ప్రధాన జంక్షన్‌గా అవతరిస్తుంది.
శతాబ్ద కాలంగా పలమనేరు ప్రజలు కన్న కల ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది. భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ఈ ప్రాంతంలో ఉత్సాహం నెలకొంది. ఈ అత్యాధునిక రైల్వే స్టేషన్ నిర్మాణం కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, పలమనేరును ఏపీలోనే అత్యంత అభివృద్ధి చెందిన పట్టణాల్లో ఒకటిగా నిలబెట్టే ఒక విప్లవాత్మక మార్పు. శతాబ్దపు నిరీక్షణకు ముగింపు పలుకుతూ, అభివృద్ధి యుగానికి పలమనేరు నాంది పలుకుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



