అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ప్లాన్
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ…అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడానికి ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌సోషల్‌లో పోస్టు పెట్టారు. ఈ యుద్ధంలో భాగం కాని చాలా దేశాలకు చెందిన నౌకలు ఈ జలసంధిలో చిక్కుకుపోయాయని ట్రంప్ తెలిపారు. వాటిని విడిపించుకోవడం కోసం ఆయా దేశాలు అమెరికా సాయాన్ని కోరాయన్నారు. వారి అభ్యర్థన మేరకు హోర్మూజ్ నుంచి నౌకలు సురక్షితంగా బయటపడేందుకు తాము సాయం చేస్తామన్నారు. ఇందుకోసం ఆయా నౌకలకు అమెరికా బలగాలు మార్గనిర్దేశం చేస్తాయన్నారు. దీనికి ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’గా పేరు పెట్టారు. ఇది సోమవారం ఉదయం నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఈ ప్రక్రియను ఒక మానవతా చర్యగా ట్రంప్ అభివర్ణించారు. చాలా నౌకల్లోని సిబ్బంది ఆహారం, నిత్యావసరాల నిల్వలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తాము తలపెట్టిన ఈ మానవతా ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలిగినా…దాన్ని బలప్రయోగంతో ఎదుర్కొంటామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా తమ ప్రతినిధులు ఇరాన్‌తో సానుకూలమైన చర్చలు జరుపుతున్నారన్నారు. ఈ చర్చలు అందరికీ మంచి ఫలితాలిస్తాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు. రెండు వారాలుగా చర్చల్లో పురోగతి కనిపించడంలదు. దీనితో హోర్మూజ్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతునే ఉన్నాయి.


