సహజ సంపదకు ఎసరు! – Visalaandhra


. కొండలను పిండి చేస్తున్న మాఫియా
. యదేచ్ఛగా నల్లరాయి, గ్రానైట్, తెల్లరాయి తవ్వకాలు
. అడవుల విధ్వంసం, పర్యావరణానికి విఘాతం
. బినామీల పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్న వ్యాపారులు
. కళ్లప్పగించి చూస్తున్న రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్ అధికారులు

విశాలాంధ్ర బ్యూరో- రంపచోడవరం: పోలవరం జిల్లాలో అక్రమ మైనింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. కొండలను పిండి చేస్తూ, అడవులను విధ్వంసం చేస్తూ, పర్యావరణానికి విఘాతం కల్పిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు మైదాన ప్రాంత బడా వ్యాపారులు. ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులకు మాత్రమే దక్కాల్సిన హక్కులను కాలరాస్తూ, బినామీల పేరుతో రూ.కోట్ల విలువైన నల్లరాయి, గ్రానైట్, తెల్లరాయి (క్వార్ట్జ్) సంపదను కొల్లగొడుతున్నారు. స్థానిక రెవెన్యూ అధికారుల ఉదాసీనత, మైనింగ్, విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ లోపం అక్రమార్కులకు వరంగా మారింది. చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ లీజులు గిరిజనులకు లేదా గిరిజన సొసైటీలకు మాత్రమే కేటాయించాలి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. రంపచోడవరం మండలం చుప్పరపాలెంలో గిరిజన క్వారీ లేబర్ సొసైటీ పేరుతో అనుమతులు పొంది, తెరవెనుక మైదాన ప్రాంతానికి చెందిన ఐఎసఆర్ మైన్స్ అండ్ మినరల్స్ సంస్థ సర్వస్వం తానై మైనింగ్ వ్యాపారం చేస్తోంది. ఊట్ల గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరులు నల్లరాయి క్వారీ, క్రషర్లను నడుపుతూ లాభాలు గడిస్తున్నారు. ఎటపాక మండలం కన్నాయిగూడెంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక గిరిజనేతర వ్యాపారి, స్థానిక గిరిజనుడి పేరును అడ్డం పెట్టుకుని ఏకంగా 11 ఎకరాల ప్రభుత్వ భూమిని 10 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నాడు. అక్రమంగా క్రషర్, క్వారీలు నిర్వహించడమే కాకుండా, పక్కనే ఉన్న రైతుల 5 ఎకరాల పట్టా భూములను కూడా కొనుగోలు చేసి నిస్సిగ్గుగా మైనింగ్ సాగిస్తున్నారు. గంగవరం మండలం ఓజ బంద గ్రామంలోని రెండు చోట్ల నల్లరాయి క్వారీలు, క్రషర్లు నాన్-ట్రైబ్స్ చేతుల్లో ఉన్నాయి. జడేరు గ్రామంలో నిబంధనలు ఉల్లంఘించి గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. నెల్లిపూడిలో యథేచ్ఛగా గ్రానైట్, నల్లరాయి క్వారీతో పాటు క్రషర్ నడుపుతున్నారు. అడ్డతీగల మండల వ్యాప్తంగా సుమారు 6 క్వారీలకు అనుమతులు లేవు. గత అనుమతులకు నామమాత్రపు రాయల్టీ కట్టేసి ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపు తున్నారు. చింతూరు మండలం గూడూరు, మధుగురు ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా అరాచకం పరాకాష్టకు చేరింది. చట్ట ప్రకారం అడవుల్లో అడుగుపెట్టడానికి వీల్లేనప్పటికీ, ఎకరాల కొద్దీ తెల్లరాయి (క్వార్ట్జ్) అక్రమ క్వారీలను నడుపుతున్నారు. సుమారు 30 ఎకరాలకు పైగా రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఆక్రమించి, వందలాది భారీ వృక్షాలను పెకలించి వేశారు. సహజ సిద్ధమైన వాగుల్లో నీరు ఇంకి పోయేలా భారీ తవ్వకాలు జరుపుతూ తెల్ల రాయిని తరలిస్తున్నారు. దీనివల్ల పర్యావరణ పూర్తిగా దెబ్బతినడమే కాకుండా, వన్య ప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్వారీల నుంచి ప్రతిరోజూ వందలాది లారీల ఖనిజం మైదాన ప్రాంతాలకు తరలిపోతోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ (సీనరేజ్ ఫీజు) లో భారీగా దొంగ లెక్కలు చూపిస్తూ పన్నులు ఎగవేస్తున్నారు. క్వారీల్లో తవ్వే ఖనిజానికి, రికార్డుల్లో చూపే దానికి అస్సలు పొంతన ఉండటం లేదు. వంద లారీల మెటీరియల్ తరలిస్తే, కేవలం పది లారీలకు మాత్రమే బిల్లులు చూపిస్తూ ప్రభుత్వ ఖజానాకు రోజుకు కోట్లాది రూపా యల గండి కొడుతున్నారు. ఈ అక్రమాల న్నింటికీ స్థానిక తహసీల్దార్ల ఉదాసీనతే ప్రధాన కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా, రైతుల పట్టా భూముల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఫిర్యాదులు వచ్చినా కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్నారే తప్ప, మైనింగ్ మాఫియాపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. పోలవరం జిల్లాలో మైనింగ్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన మైనింగ్ శాఖ ఇక్కడ నామమా త్రంగా కూడా లేదు. ఈ జిల్లాకు ప్రత్యే కంగా మైనింగ్ అధికారులు లేకపోవడం పెద్ద శాపంగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కి ఈ జిల్లా అదనపు బాధ్యతలను అప్పగించారు. రెండు జిల్లాల విస్తీర్ణం భారీగా ఉండటంతో ఆయనకు క్షేత్రస్థాయి పరిశీలన, పర్యవేక్షణ అసాధ్యంగా మారింది. దీనికి తోడు జిల్లాలో అక్రమాలను కనిపెట్టాల్సిన విజిలెన్స్ శాఖ కూడా లేకపోవడంతో అక్రమార్కులకు ఎలాంటి భయం లేకుండా పోయింది. అడిగే నాథుడు లేకపోవడంతో యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *