మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా శక్తిమంతమైన హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఒరెష్నిక’ సహా పలు క్షిపణులు, వందల డ్రోన్లతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని నగరం ‘కైవ్’పై మున్ముందు భారీ దాడులు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విధాన నిర్ణయాల్లో కీలకమైన భవనాలు, రక్షణరంగ పరిశ్రమలు, కమాండ్ సెంటర్లు, డ్రోన్ తయారీ కేంద్రాలు లక్ష్యంగా దాడులు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది. వెంటనే విదేశీ దౌత్యవేత్తలు, పౌరులు నగరాన్ని వీడాలని రష్యా తన హెచ్చరికల్లో పేర్కొంది.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు అవకాశం ఉన్నందున కైవ్‌లోని అమెరికా దౌత్య సిబ్బందిని ఖాళీ చేయించాలని రూబియోకు లావ్రోవ్ సూచించారు. ‘దౌత్యవేత్తలు, పలు అంతర్జాతీయ సంస్థల సిబ్బంది, విదేశీయులు సాధ్యమైనంత త్వరగా కైవ్‌ను వీడండి. మిలిటరీ, పరిపాలనా భవనాలకు సాధారణ పౌరులు దూరంగా ఉండాలి’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ తన ప్రకటనలో పేర్కొంది. అయితే రష్యా ఈ తరహా ప్రకటన చేయడం ఇదే తొలిసారి కాదు. తమ రెడ్ స్క్వేర్ వద్ద మిలిటరీ పరేడ్‌కు ఏవైనా అంతరాయాలు కలిగించాలని యత్నిస్తే.. కీవ్‌పై భారీ దాడులు ఉంటాయని మే నెల ప్రారంభంలోనూ పుతిన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇలాంటి బెదిరింపులకు తాము తలొగ్గబోమని ఉక్రెయిన్ ఆ ప్రకటనలను ఎప్పటికప్ప్పుడు తోసిపుచ్చుతోంది. తాజాగా కైవ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి.
The post విదేశీయులు ‘కైవ్’ను వీడి వెళ్లండి: రష్యా appeared first on Visalaandhra.


