నేటి నుండి జరిగే ఏఐటియుసి మహాసభలకు వేలాదిగా తరలిరండి
-ఏఐటీయూసీ రాష్ట్ర నేతలు రవీంద్రనాథ్, వెంకటసుబ్బయ్య
విశాలాంధ్ర-తిరుపతి: కేంద్ర ప్రభుత్వం కార్మికులను కట్టుబానిసలుగా మార్చేలా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సమరశీలం పోరాటాలకు సిద్ధమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవీంద్రనాథ్, వెంకటసుబ్బయ్య పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో ఈ నెల 26, 27, 28 తేదీలలో నిర్వహించనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభల సందర్భంగా నాయకులు శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. గత 12 ఏళ్లుగా తీవ్రమైన పోరాటాలు చేస్తున్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తూ లేబర్ కోడ్లను అమలు చేయాలని చూడటాన్ని ఏఐటీయూసీ తీవ్రంగా ఖండించారు. ఇటీవల నోయిడాలో తమ న్యాయమైన కోర్కెల కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన 45 వేల మంది అవుట్ సోర్సింగ్ కార్మికులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అణచివేతకు పాల్పడటాన్ని నాయకులు తప్పుపట్టారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి, కార్మికులను అరెస్టులు చేసి నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 144 చట్టాలను నీరుగార్చేలా ఉన్న నూతన లేబర్ కోడ్లను రద్దు చేసి, పాత చట్టాలను పునరుద్ధరించాలన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఆటో, హమాలీ, భవన నిర్మాణ, వీధి విక్రయదారుల వంటి అసంఘటిత రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డులను బలోపేతం చేయాలన్నారు. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆరోగ్య మిత్ర వంటి పథకాలలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంబంధిత ప్రయోజనాలు కల్పించాలన్నారు. కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి ఈ మహాసభల వేదికగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి ఇందిరా మైదానంలో భారీ బహిరంగ సభ జరగనుందని…. ఈ సభకు ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అమర్ జీత్ కోర్, రాష్ట్ర అధ్యక్షులు ఆర్. రవీంద్రనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకట సుబ్బయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య తదితర ముఖ్య నేతలు హాజరవుతారన్నారు. మహాసభల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖ సినీ నిర్మాత మాదాల రవి ఈ సాంస్కృతిక ప్రదర్శనలను ప్రారంభిస్తారని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ వెల్లడించింది. ఈ విలేకరుల సమావేశంలో గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగ సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి, రమేష్, జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ, నగర కార్యదర్శి ఎన్ డి రవి తదితరులు పాల్గొన్నారు.
The post లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు విశ్రమించం appeared first on Visalaandhra.


