తీర్మానాల పేరుతో దోపిడీ? ఉరవకొండలో భారీ భూకుంభకోణం వెలుగులోకి
ఫోటో వివరాలు వెల్లడిస్తున్న ఎంపీడీవో రవి ప్రసాద్
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా): ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుల వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. గ్రామపంచాయతీ సమావేశాల్లో తీసుకున్న తీర్మానాలను ఆధారంగా చేసుకుని, 1995 నుంచి 2021 వరకు సుమారు రూ.250 కోట్ల విలువ చేసే భూములను నిబంధనలకు విరుద్ధంగా కేటాయించినట్లు సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఈ భూములను వివిధ కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, చేనేత సొసైటీలకు వివిధ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి, ప్రెస్ క్లబ్, దేవాలయాలు, కళ్యాణ మండపాలు, ప్రభుత్వ కార్యాలయాలకు అలాగే పంచాయతీ కార్యాలయంలో పనిచేసే కొందరు వ్యక్తులకు ఇలా 109 పంచాయతీ స్థలాలను కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేటాయింపుల్లో ప్రభుత్వ అనుమతి లేకపోవడం, లీజు ఒప్పందాలు లేకుండా నేరుగా భూములను వినియోగంలోకి తీసుకోవడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఉరవకొండకు చెందిన మధుబాబు లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న లోకాయుక్త, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన భూముల కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.
లోకాయుక్త ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు నిర్వహించిన ప్రాథమిక విచారణలోనే భారీ అక్రమాల సంకేతాలు బయటపడ్డాయి. దాదాపు రూ.250 కోట్ల విలువైన పంచాయతీ భూములు అనుమతులు లేకుండా కేటాయించబడినట్లు నివేదికల్లో వెల్లడైంది. అనేక ప్రదేశాల్లో ఎలాంటి లీజులు చెల్లించకుండా శాశ్వత నిర్మాణాలు చేసి కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మరి కొంతమంది వ్యక్తులు తమ సొంత పనులకు ఉపయోగించుకుని ఆదాయాలు పొందుతున్నారు. మరి కొంతమంది ఏకంగా పంచాయతీ స్థలాలను లక్షలకు విక్రయించడం కూడా జరిగింది. దీంతో పంచాయతీ అధికారులు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీడీవో రవి ప్రసాద్, ఈఓఆర్డి సతీష్ కుమార్, గ్రామ కార్యదర్శి మహమ్మద్ రఫీ సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.ఈ సమావేశానికి హాజరైన
లబ్ధిదారులు కొంతమంది తమ వాదనలు వినిపించినప్పటికీ, అక్రమాల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తీర్మానాలు ద్వారా కేటాయించిన స్థలాలన్నింటిని కూడా రద్దుచేసి జిల్లా కలెక్టర్కు స్థానిక అధికారులు నివేదికల పంపుతున్నారు.ఈ వ్యవహారం కేవలం పరిపాలనా లోపమా? లేక ప్రణాళికాబద్ధంగా జరిగిన భూకుంభకోణమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా, లీజు చెల్లింపులు లేకుండా, కేవలం పంచాయతీ తీర్మానాల ఆధారంగా కోట్ల విలువైన భూములు కేటాయించబడటం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
లోకాయుక్త విచారణతో ఈ వ్యవహారం మరింత లోతుగా వెళ్లే అవకాశముండగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా? లేదా మళ్లీ ఇదీ ఫైళ్లకే పరిమితమవుతుందా? అన్నది ఇప్పుడు ఉరవకొండ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.


