మోదీయే మహిళా బిల్లును చంపేశారు


డీలిమిటేషన్ బిల్లును మాత్రమే మేం వ్యతిరేకించాం: ఖడ్గే

కూచ్ బిహార్(పశ్చిమబెంగాల్): పునర్విభజన బిల్లునే విపక్షం వ్యతిరేకించిందని, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును చంపేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ఆరోపించారు. ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుల్ని వ్యతిరేకించడం ద్వారా విపక్షం ‘భ్రూణహత్య’కు పాల్పడిందని ప్రధాని ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. మహిళా కోటాను తాము వ్యతిరేకించలేదని, విపక్షాల పోరాటమంతా డీలిమిటేషన్ బిల్లుపైనే అని స్పష్టంచేశారు. పశ్చిమబెంగాల్‌లోని కూచ్ బిహార్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గాల పునర్విభజనను ముందుకు జరిపి దేశంలో సార్వత్రిక ఎన్నికలను ముందుగానే నిర్వహించాలని మోదీ భావిస్తున్నారు. మోదీ ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచారు. మహిళా సాధికారతకు పాటుపడుతున్నట్లు చెప్ప్పుకుంటున్నారు. మహిళా హక్కులు, వారి సంక్షేమం మాకెంతో ప్రాధాన్య అంశం. 2010లోనే రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును యూపీఏ సర్కారు ఆమోదించింది. మోదీ సర్కారు 30 నెలలుగా దానిపై నిద్రపోయి… ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ముందు మేల్కొంది. సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, సోనియాగాంధీ వంటి మహిళా నేతలు మా పార్టీవారే. బీజేపీ ఒక్కసారైనా మహిళకు అధ్యక్ష పదవిని ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మోదీ బెంగాల్ ప్రచారంలో తిరుగుతూ తన అధికారిక విధుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఖడ్గే మండిపడ్డారు. ఆయన ప్రధానిగా కొనసాగదలచుకున్నారా, లేదంటే బెంగాల్‌కు సీఎం అవుదామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి జిమ్మిక్కులకు ఇంకెక్కడైనా ఫలితం ఉంటుందేమో గానీ బెంగాల్ ప్రజలు మాత్రం పడిపోరని ఎద్దేవా చేశారు. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని పార్టీలతో ఎన్నికల పొత్తులు పెట్టుకుని చాలా నష్టపోయిందని చెప్పారు.

The post మోదీయే మహిళా బిల్లును చంపేశారు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *