ముక్కంటి భూములకు రక్షణేదీ..?


*మౌనముద్రలో అధికారులు..
*రూ.కోట్లు విలువ చేసే ఆస్తులు పరాధీనం!

                          (విశాలాంధ్ర-శ్రీకాళహస్తి)

దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం భక్తుల పాలిట కల్పవృక్షం. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ, రాహు-కేతు పూజలతో స్వామివారికి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నారు. అయితే, భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించిన భూములు, ఆస్తుల విషయంలో మాత్రం దేవదాయ శాఖ అధికారులు ఘోర వైఫల్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముక్కంటి ఆస్తులు కళ్లముందే కరిగిపోతున్నా, అన్యాక్రాంతమవుతున్నా అధికారులు మాత్రం మౌనముద్ర వహించడం పలు విమర్శలకు దారితీస్తోంది.

నిర్లక్ష్యం వెనుక అసలు కారణాలివేనా?

ఆలయ భూములకు రక్షణ కరువవ్వడానికి ప్రధాన కారణం అధికారుల మధ్య సమన్వయ లోపమేనని స్పష్టమవుతోంది. ఆలయ ఈవోలు తరచూ బదిలీ అవుతుండటం, కొత్తగా బాధ్యతలు చేపట్టిన వారికి ఆలయ స్థిరాస్తులపై సరైన అవగాహన లేకపోవడం కబ్జాదారులకు వరంగా మారింది. దీనికి తోడు, కొందరు ఆలయ ఉద్యోగులే కబ్జాదారులతో చేతులు కలిపి లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆలయ యంత్రాంగం కేవలం ఆదాయం వచ్చే రాహు-కేతు పూజల నిర్వహణపైనే దృష్టి సారిస్తోంది తప్ప, తరతరాలుగా స్వామివారికి సంక్రమించిన వేల కోట్ల విలువైన ఆస్తులను కాపాడాలన్న ధ్యాస లేకుండా పోయింది.

శ్రీకాళహస్తి నడిబొడ్డునే పరాధీనం

శ్రీకాళహస్తి పట్టణంలోనే అత్యంత విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి.
*బ్రహ్మకుమారి సమాజం ఆధీనంలో ఇంటి స్థలం: గతంలో తహసీల్దారు కార్యాలయం సమీపంలో ఒక కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడుతూ, తమ ఇంటిని ముక్కంటి ఆలయానికి రాసిచ్చారు. కొండుగారి శ్రీరామమూర్తి ఛైర్మన్ గా ఉన్న సమయంలో ఈ ఆస్తి ఆలయానికి సంక్రమించింది. అయితే, ప్రస్తుతం అక్కడ బ్రహ్మకుమారి సమాజం వారు ఉంటున్నారు. అసలు ఏ ప్రాతిపదికన ఈ స్థలాన్ని వారికి కేటాయించారు? అసలు ఆ స్థలం తమదే అన్న విషయం అధికారులకు తెలుసా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
*రైతుల విశ్రాంతి స్థలం కబ్జా: పై స్థలానికి సమీపంలోనే గతంలో పల్లెల నుంచి వచ్చే రైతులు తమ ఎడ్లబండ్లను నిలిపి విశ్రాంతి తీసుకునే స్థలం ఉంది. ఇది కూడా ఆలయానికే చెందినది. కానీ నేడు ఆ స్థలం ఆక్రమణదారుల హస్తగతమైపోయింది.
*సుబ్రహ్మణ్యస్వామి కోనేరు వద్ద ఆక్రమణ: పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే సుబ్రహ్మణ్యస్వామి కోనేరు ప్రాంతంలో ఆలయ భూమిని ఆక్రమించి ఏకంగా ప్రహారీ గోడలు కూడా నిర్మించేశారు. ఇంత జరుగుతున్నా ఆలయ సెక్యూరిటీ లేదా ల్యాండ్ విభాగం అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
*భక్తకన్నప్ప సదన్ సమీపంలో: జయరామరావు వీధిలో భక్తకన్నప్ప సదన్ వద్ద వినాయకస్వామి ఆలయం పక్కనే ఉన్న ఖరీదైన స్థలాన్ని కబ్జా చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ ఆక్రమణ యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో …

కేవలం పట్టణంలోనే కాదు, మండల పరిధిలోని గ్రామాల భూములు కూడా కబ్జాకు గురవుతున్నాయి. శ్రీకాళహస్తి మండలం చుక్కలనిడిగల్లు వద్ద ముద్దుకృష్ణారెడ్డి అనే భక్తుడు స్వామివారిపై భక్తితో సుమారు 40 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. నేడు ఈ భూమిలో మెజారిటీ భాగం ఆక్రమణకు గురైంది. దాతల ఆశయం ఇక్కడ నీరుగారిపోతోంది. ఇదే మండలం ఇసుకగుంట వద్ద ఆలయానికి చెందిన కోనేరు, మండపం, టెంకాయ చెట్లు ఉన్నాయి. పూర్వం స్వామివారి ఉత్సవాల సమయంలో ఇక్కడికి ఊరేగింపుగా వచ్చేవారని పెద్దలు చెబుతుంటారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ భూమి కూడా ప్రస్తుతం అన్యాక్రాంతమైపోయింది.

రాష్ట్ర సరిహద్దులు దాటినా దక్కని రక్షణ

ముక్కంటి ఆస్తులు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటి తమిళనాడులోనూ విస్తరించి ఉన్నాయి. చెన్నై సమీపంలోని పొన్నేరి వద్ద రూ. వందల కోట్ల విలువ చేసే ఆలయ భూములు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ విలువైన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి. పొరుగు రాష్ట్రంలో ఉన్న ఆస్తులను పర్యవేక్షించే నాథుడే కరువయ్యారు.

*గుడివాడ (ఏపీ): కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో కూడా ఆలయానికి కోట్ల విలువైన భూములు ఉన్నాయి. ఇక్కడ స్థానిక రాజకీయ నేతలు జోక్యం చేసుకుని కొంత మేర భూమిని ఇప్పటికే ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వం స్పందించాలి

మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించడం తప్ప, క్షేత్రస్థాయిలో భూములను సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయడంలో దేవదాయ శాఖ విఫలమైంది. ఆలయ భూముల్లో వెంటనే ‘ఈ భూమి శ్రీకాళహస్తీశ్వరస్వామికి చెందినది’ అనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆక్రమణకు గురైన భూములపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించి, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఆలయ ఆస్తుల వివరాలను జియో ట్యాగింగ్ చేసి, భక్తులందరికీ తెలిసేలా ఆన్‌లైన్‌లో ఉంచాలి.

ధర్మకర్తల మండలి బాధ్యత ఏది?

కేవలం ప్రోటోకాల్ దర్శనాలకే పరిమితం కాకుండా, ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఆలయ ఆస్తుల పరిరక్షణపై దృష్టి సారించాలి. ప్రతి ఇంచ్ భూమిని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం, దేవదాయ శాఖ మేల్కొనకపోతే.. ముక్కంటి ఆస్తులు కేవలం రికార్డులకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.

The post ముక్కంటి భూములకు రక్షణేదీ..? appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *