తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండలో జరిగిన మెగా రైతు మేళాలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు పక్షపాత ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి గత ప్రభుత్వం పదేళ్ల సమయం తీసుకుందని… కానీ తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తూనే, రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేసిందని గుర్తుచేశారు.గత హయాంలో వరి వేస్తే ఉరి అన్న పరిస్థితులు ఉండేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు భరోసా కల్పిస్తూ సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వంగా నిలిచిందని చెప్పారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎకరానికి రూ. 12 వేల ఆర్థిక సాయంతో పాటు అత్యాధునిక వ్యవసాయ పరికరాలను రైతులకు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 1,200 కోట్లు చెల్లించిందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో రైతును రాజు చేసే వరకు తమ ప్రభుత్వం విశ్రమించబోదని, ప్రతి రైతుకు మద్దతు ధరతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.


