మళ్లీ పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. 19 కిలోల సిలిండర్‌పై రూ.42 భారం


వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు మరోసారి ధరల భారం పడింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 19కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.42మేర పెంచినట్లు తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. కోల్‌కతాలో ఈపెంపు మరింత ఎక్కువగా ఉండి రూ.53.50గా నమోదైంది.
అలాగే ఐదుకిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా రూ.11చొప్పున పెంచారు.
అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
దేశంలో ఎల్పీజీ రిటైల్ ధరలను సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్,భారత్ పెట్రోలియం,హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలు సమన్వయంతో నిర్ణయిస్తుంటాయి.
దీంతో ఇతర గ్యాస్ మార్కెటింగ్ సంస్థల ధరల్లో కూడా త్వరలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

హర్మూజ్ ఉద్రిక్తతల ప్రభావం
ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు,హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రవాణాపై ఏర్పడిన అంతరాయాలు భారత్‌లో ఎల్పీజీ సరఫరా, ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
దేశానికి అవసరమైన ఎల్పీజీ గ్యాస్‌లో గణనీయమైన భాగం ఖతార్, సౌదీ అరేబియా,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వంటి గల్ఫ్ దేశాల నుంచి ఈ మార్గం ద్వారానే దిగుమతి అవుతోంది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలకు కీలక సూచనలు చేసింది. సాధారణ వాణిజ్య నిల్వలకు అదనంగా కనీసం 30 రోజుల అవసరాలకు సరిపడే ఎల్పీజీ నిల్వలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. భవిష్యత్తులో దిగుమతులలో అంతరాయాలు ఎదురైనా దేశీయ సరఫరాపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *