మమతా బెనర్జీకి మరో షాక్‌.. ఇంటికి సీఐడీ పోలీసులు!


అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటుతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న మమతా బెనర్జీకి మరో తలనొప్పి వచ్చిపడింది. శాసనసభ్యుల సంతకాల ఫోర్జరీ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు మంగళవారం మమతా బెనర్జీ నివాసానికి చేరుకున్నారు. కోల్‌కతాలోని 30దీ, హరీశ్‌ ఛటర్జీ స్ట్రీట్‌లో ఉన్న ఆమె నివాసంలో సోదాలు నిర్వహించేందుకు సీఐడీ బృందం అక్కడకు వెళ్లడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆమె ఇంటి చిరునామాతో తృణమూల్ కాంగ్రెస్ అధికారిక పార్టీ కార్యాలయం కూడా నమోదై ఉన్నందున తాము ప్రాంగణాన్ని తనిఖీ చేయాల్సి ఉందని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. అయితే, మాజీ ఎంపీ సుభాశిష్ చక్రవర్తితో సహా పలువురు టీఎంసీ నాయకులు అధికారులను లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో నివాసం వెలుపల కొంత సేపు తీవ్ర ఉద్రిక్తత, వాగ్వాదం చోటుచేసుకున్నాయి.

మమతా బెనర్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇద్దరూ ప్రస్తుతం ఇంట్లో లేరని, కాబట్టి సోదాలకు అనుమతించలేమని, ఒకట్రెండు రోజుల తర్వాత రావాలని సుభాశిష్ చక్రవర్తి కోరారు. అయితే, దీనిపై సీఐడీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. తాము చట్టప్రకారం విచారణకు వస్తే అడ్డుకోవడం నేరమని స్పష్టం చేశారు. కొద్దిసేపు ఘర్షణ తర్వాత సీఐడీ బృందం లోపలికి వెళ్లింది.

మే 20న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌కు తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఒక లేఖ సమర్పించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా సోవన్ దేబ్ ఛటోపాధ్యాయను ఎన్నుకుంటూ ఈ లేఖను ఇచ్చారు. అయితే ఈ లేఖపై ఉన్న తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ టీఎంసీ ఎమ్మెల్యేలు రితబ్రతా బెనర్జీ, సందీపన్ సాహా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివాదం ముదిరి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.

ఈ ఫోర్జరీ వ్యవహారంపై కోల్‌కతాలోని హేర్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా బెంగాల్ ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. స్పీకర్‌కు పంపిన ఆ వివాదాస్పద లేఖపై పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ సంతకం చేసినందున, విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ ఆయనకు పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే, అనారోగ్య కారణాలను చూపుతూ అభిషేక్ బెనర్జీ వ్యక్తిగతంగా హాజరుకాకుండా.. తనకు 15 రోజుల సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలోనే సీఐడీ నేరుగా మమతా బెనర్జీ ఇంటికి రావడం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *