అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగ కార్యక్రమాల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ జాకెట్ వేసుకుంటే తాను లావుగా కనిపిస్తానని, అందుకే దాన్ని ధరించడం తనకు ఇష్టంలేదని వెల్లడించారు. ఇప్పటికే ట్రంప్‌పై గతంలో రెండుసార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా కూడా కాల్పులు చోటుచేసుకోవడంతో ఆయన భద్రతా ఏర్పాట్లు—ముఖ్యంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించకపోవడం—పై విస్తృత చర్చ మొదలైంది. గురువారం ఓవల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఓ జర్నలిస్టు ఈ అంశంపై ప్రశ్నించగా, ట్రంప్ సరదాగా స్పందించారు. ఆ జాకెట్ ధరించితే తాను 20 పౌండ్లు బరువు పెరిగినట్లు కనిపిస్తానని, అది తనకు అస్సలు నచ్చదని చెప్పారు.
ఆయన వ్యాఖ్యలకు అక్కడున్న విలేకరులు, కాంగ్రెస్ సభ్యులు ఒక్కసారిగా నవ్వులు పూయించారు. అయితే భద్రతా జాగ్రత్తలు అవసరమని కూడా ఆయన అంగీకరించారు. “చాలామంది ఈ విషయం గురించి నన్ను అడిగారు. అది పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమే. కానీ, నాకు అలా చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అలా చేస్తే ఒక చెడు శక్తికి మనం లొంగిపోయినట్లుగా భావిస్తానుని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో మరో విలేకరి, మరోసారి దాడి జరిగే అవకాశంపై ఆందోళన ఉందా అని ప్రశ్నించగా, ట్రంప్ దానిపై తాను ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. అలా ఆలోచిస్తే తన పనిని సమర్థవంతంగా నిర్వహించలేనని ఆయన తెలిపారు.


