ప్రధాని మోదీ ఇచ్చిన మేడే గిఫ్ట్ ఇదే: కేటీఆర్


ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం అలవాటుగా మారిందని విమర్శ
కార్మికుల సంక్షేమం రేవంత్ రెడ్డికి పట్టడం లేదన్న కేటీఆర్

ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అలవాటుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మేడే కానుకగా హోటల్ కార్మికులకు ఇచ్చిన బహుమతి కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచడమేనని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో రూపాయి పాతాళానికి పడిపోతుంటే, సిలిండర్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ జెండాను కేటీఆర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.కార్మికుల సంక్షేమం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. సిగాచీ పరిశ్రమలో కార్మికులు ప్రమాదంలో చనిపోతే వారికి ఇప్పటి వరకు పరిహారం అందలేదని అన్నారు. ఎన్నికలకు ముందు ఆయన దానవీర శూరకర్ణలా మాట్లాడారని, ఎన్నికలు అయ్యాక కుంభకర్ణుడిలా మారిపోయాడని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు జేమ్స్ బాండ్‌లా బాండు పేపర్లు ఎందుకు రాసిచ్చారని ప్రశ్నించారు.

హామీల గురించి అడిగితే బూతులు తిడుతున్నారని ధ్వజమెత్తారు. తాను ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ఎలా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ రేవంత్ రెడ్డి లాంటి సీఎంను చూడలేదని అన్నారు. రేవంత్ రెడ్డి ఎలాగూ మరోసారి ముఖ్యమంత్రి కాబోరని, కానీ ఉన్నన్నాళ్ళైనా నాలుగు మంచి పనులు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. కార్మికులు అంటే రేవంత్ రెడ్డికి లెక్కలేదని అన్నారు.

తాను కొన్ని కొన్ని నెలల క్రితం పార్టీ కార్యాలయం వద్ద కారు అందుబాటులో లేకపోవడంతో మష్రత్ అలీ అనే వ్యక్తి ఆటోను ఎక్కానని తెలిపారు. ఆ సమయంలో ఆయనతో మాట్లాడానని, ఆయన చెప్పిన విషయాల విని ఆందోళన చెందానని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే మష్రత్ అలీ ఆటోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కారని, ఆ సమయంలో అతనికి రెండు ఆటోలు ఉండేవని చెప్పారు. రాహుల్ గాంధీ ఎక్కిన తర్వాత ఆయన తన ఆటోలను అమ్మేసుకుని కిరాయి ఆటో నడుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కొందరి అడుగు అలా ఉంటుందని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *