కోనాల భీమారావు
కమ్యూనిస్టు ఉద్యమ గమనంలో కొన్ని జంటలు కేవలం దంపతులుగానే కాకుండా విడదీయలేని ఆశయ బంధాలుగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన, ఆదర్శవంతమైన జంట దివంగత వంక సత్యనారాయణ -నాగమణి జంట. 70 ఏళ్ళ వారి వైవాహిక జీవితంలో ఉద్యమమే ఊపిరిగా, ఆశయమే బాటగా సాగిన వారి ప్రస్థానం నేటి తరానికి ఒక పాఠం. వంక సత్యనారాయణ తన 95వ ఏట 2018లో కన్నుమూయగా వంక నాగమణి తన 95వ ఏటే 2026 ఏప్రిల్ 5న కన్ను మూశారు. తెలుగు నేలపై కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తిలో మహిళా చైతన్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో తనదైన ముద్ర వేసి 95 ఏళ్ల నిండు జీవితాన్ని ఉద్యమ స్ఫూర్తితో గడిపిన ఆదర్శ మహిళ వంక నాగమణి. సీపీఐ నేత, మాజీ శాసనసభ్యులు దివంగత వంక సత్యనారాయణ అర్ధాంగిగా మాత్రమే కాదు ఒక స్వతంత్ర నాయకురాలిగా, మహిళా సమాఖ్య నేతగా ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం. వంక నాగమణి 1931 అక్టోబర్ 19న కాకినాడలో గంటా వెంకటరత్నం, సూర్యకాంతం దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచే చురుకైన స్వభావం కలిగిన ఆమె 1948లో ఎనిమిదవ తరగతి ఉత్తీర్ణులయ్యారు. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్న క్లిష్ట కాలంలో పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై 18 ఏళ్ల ప్రాయంలోనే పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 1948లో భీమవరం తాలూకా కొండేపాడు గ్రామంలో ఉద్ధరాజు రామం, గాదె సత్యనారాయణ, సంకు అప్పారావు వంటి అగ్రనేతల సమక్షంలో రహస్యంగా వంక సత్యనారాయణతో ఆమె వివాహం జరిగింది. ఎటువంటి ఆడంబరాలు, సంప్రదాయాలకు తావులేకుండా ఆదర్శవంతమైన ‘కమ్యూనిస్టు వివాహం’ చేసుకున్న ఆ జంట 70 ఏళ్ల పాటు అన్యోన్య దాంపత్యాన్ని గడిపారు. పెళ్లయిన కొత్తలోనే పార్టీపై నిషేధం కారణంగా వంక సత్యనారాయణ అజ్ఞాతంలోకి వెళ్లగా నాగమణి పోలీసుల వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. భయం నీడలో కాలం గడుపుతూనే, మరోవైపు ఇంటి బాధ్యతలను భుజాన వేసుకున్నారు. 1948లో బెజవాడలో జరిగిన రాష్ట్ర మహిళా శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆమె పోలీసుల లాఠీఛార్జీని ఎదుర్కొని అరెస్టు అయ్యారు.
ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా తణుకు ప్రాంతంలో మహిళా సమాఖ్యను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.మూఢ నమ్మకాలు, వరకట్నం, మద్యపానానికి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమె అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. వంక సత్యనారాయణ ప్రజా సమస్యల పోరాటంలో ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవారు. ఆ సమయంలో ఐదుగురు సంతానాన్ని క్రమశిక్షణతో పెంచి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత నాగమణిదే. ఆమె కుమారుడు వంక రవీంద్రనాథ్ (ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎమ్మెల్సీ) తన తల్లి గురించి చెబుతూ “నాన్న గారు మాకు అతిథి లాంటి వారు, అమ్మే అన్నీ అయి మమ్మల్ని పెంచింది” అని పేర్కొనడం ఆమె బాధ్యతాయుత ప్రవృత్తికి నిదర్శనం. వంక సత్యనారాయణ రాసిన తన ఆత్మకథ ‘తొమ్మిది పదులు’ పుస్తకంలో తన విజయాల వెనుక నాగమణి ప్రోత్సాహం ఎంత ఉందో వివరిస్తూ ఆమెను తన రాజకీయ ప్రస్థానంలో ‘చేదోడు వాదోడు’ గా అభివర్ణించారు. పార్టీ కోసం బుర్రకథలు చెప్పడం, పాటలు పాడటం, హార్మోనియం వాయించడం వంటి కళారూపాల ద్వారా కూడా ఆమె పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వంక నాగమణి మరణం తణుకు ప్రాంతానికే కాకుండా, రాష్ట్ర మహిళా ఉద్యమానికి తీరని లోటు. ఆమె జీవించిన విధానం, ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాలు నేటి తరానికి ఆదర్శం. కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల అంకితభావం, కుటుంబం పట్ల బాధ్యత రెండింటినీ సమన్వయం చేసుకున్న ఆమె ఒక ధృవతార. ఈ నెల 15న తణుకులో జరిగే ఆమె సంస్మరణ సభలో పార్టీ శ్రేణులు, మహిళా లోకం ఆమెకు ఘనంగా నివాళులర్పించనున్నారు. అమరజీవి వంక నాగమణి ఆశయాలు వర్ధిల్లాలి!
( ఏప్రిల్ 15న వంక నాగమణి సంస్మరణ సభ సందర్బంగా )
పశ్చిమ గోదావరి జిల్లా సీపీఐ కార్యదర్శి
మొబైల్ : 97055 57367


