పేలుడు ధాటికి కూలిన ఇళ్లు, పలువురికి గాయాలు.. కదిరి పేలుడు వెనుక అసలు నిజం ఇదే..! kadiri quarry explosion tragedy four dead 18 injured | అనంతపురం వార్తలు (Anantapuram News)


Last Updated:

శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో జెలటిన్ స్టిక్స్ పేలుడు, నలుగురు మృతి, 19 మందికి గాయాలు, ఇళ్లు శిథిలం, ప్రభుత్వం పరిహారం ప్రకటించింది

+

పేలుళ్లలో

పేలుళ్లలో మృతుల కుటుంబానికి 5 లక్షల పరిహారం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో బుధవారం జరిగిన భారీ పేలుడుతో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. రాళ్లు పేల్చేందుకు ఉపయోగించే పేలుడు పదార్థాలు అకస్మాత్తుగా పేలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని తొలుత కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి పంపించారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామ సమీపంలోని క్వారీల్లో రాళ్లు పేల్చేందుకు తెలంగాణకు చెందిన కార్మికులు అక్కడ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. ప్రతిరోజులాగే బుధవారం ఉదయం క్వారీకి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఇంట్లోనే పేలుడు సామగ్రిని సిద్ధం చేస్తుండగా ఒక్కసారిగా పొగలు ఎగసిపడ్డాయి. ప్రమాదాన్ని గుర్తించిన కార్మికులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. అయితే ఇంట్లో నిల్వ ఉంచిన జెలటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు, గ్యాస్ కలిసి ఒక్కసారిగా మంటలు వ్యాపించి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.

ఈ పేలుడు తీవ్రతకు సమీపంలోని మూడు ఇళ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. మంటలు భారీగా వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. మంటలను అదుపు చేయడానికి పరుగెత్తిన గ్రామస్తుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను విశ్వనాథరెడ్డి (50), మధుసూదన్ (40), అస్లాం భాషా (50), మా బునీ వీసా (50)గా గుర్తించారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించే క్రమంలో ఊపిరాడకపోవడం, తీవ్రంగా గాయపడటం వల్ల వారు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అశోక్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. క్లూస్ టీమ్‌ను కూడా రంగంలోకి దించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామం మొత్తం ఉలిక్కిపడగా, మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంటలు ఆర్పేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారిపై కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.

ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎం. శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, గాయపడిన వారి చికిత్సపై వైద్యాధికారులతో చర్చించారు. ప్రమాదానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఈ విషాద ఘటన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన బాధితుడికి రూ.1 లక్ష, ఇతర గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఇల్లు దెబ్బతిన్న వారికి పక్కా గృహాలు మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం, భద్రతా నిబంధనలు పాటించకపోవడంపై దృష్టి సారించిన అధికారులు, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం అసలు కారణాలను వెలుగులోకి తీసుకురానున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *