జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు
విశాలాంధ్ర ధర్మవరం;;జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన యురేకా సైన్స్ ఎక్స్పో -2026 సైన్స్ ప్రయోగాల పోటీలలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ , సత్యనిర్ధారన్ లు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు అరుణా దేవి, కల్యాణి,పద్మశ్రీ, కవిత , ఉమాదేవి లతో కలిసి విద్యార్థులకు సర్టిఫికెట్స్ , బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూఢనమ్మకాల విభాగంలో ప్రమదవాణి పంపిన వీడియో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలోనూ, ఎన్విరాన్మెంట్ మరియు సుస్థిర అభివృద్ది విభాగంలో ప్రమదవాణి, రుక్సానాలు పంపిన వీడియో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాయన్నారు. విద్యార్థులు ప్రయోగాలు చేయడం ద్వారా కొత్త జ్ఞానాన్ని, కొత్త పద్ధతులను కనుగొంటారన్నారు. ఈ ప్రక్రియ వ్యక్తిగత మరియు శాస్త్రీయ అభివృద్ధికి పునాది వేస్తుందన్నారు. పిల్లలు చేసే ప్రయోగాలు భవిషత్ లో ఈ దేశ అభివృద్ధికి ముఖ్యమైన మెట్లు అన్నారు.. సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రజలు మూఢనమ్మకాలు విడనాడి శాస్త్రీయ దృక్పథం వైపు నడవాలన్నారు..అది సాధ్యం కావాలంటే విద్యారి దశలోనే శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. అందులో భాగంగానే జనవిజ్ఞాన వేదిక ప్రతీ సంవత్సరం చెకుముకి సైన్స్ సంబరాలు, యురేకా సైన్స్ ఎక్స్పో లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.
పిల్లలను ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను ,అదేవిధంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులను జెవివి ప్రతినిధులు అభినందించారు..విద్యార్థులను ప్రోత్సహించడం కోసం సత్యనిర్ధారన్ ప్రత్యేక బహుమతులు అందించారు.


