పీఏబీఆర్ జలాశయంలో మునిగి తల్లి–కూతురు మృతి..


విహారయాత్రకు వెళ్లిన కుటుంబంలో తీరని శోకం

విశాలాంధ్ర:ఉరవకొండ ..బక్రీద్ పండుగ ముగింపు వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని వెళ్లిన ఓ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. విహారయాత్రకు వెళ్లిన తల్లి–కూతురు జలాశయంలో మునిగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ హృదయ విదారక ఘటన శనివారం ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని పీఏబీఆర్ జలాశయం వద్ద చోటుచేసుకుంది.అనంతపురం పట్టణంలోని ఆజాద్‌నగర్‌కు చెందిన తొమ్మిది మంది కుటుంబ సభ్యులు బక్రీద్ పండుగ అనంతరం సరదాగా గడిపేందుకు ఉరవకొండ మండలంలోని కౌకుంట్ల గ్రామ సరిహద్దు ప్రాంతంలోని పీఏబీఆర్ జలాశయానికి వెళ్లారు. రోజంతా కలిసి భోజనాలు చేసుకుంటూ ఆనందంగా గడిపిన కుటుంబ సభ్యులకు ఊహించని ప్రమాదం ఎదురైంది.సమీపంలోని నీటి ప్రాంతంలో ఆడుకోవడానికి వెళ్లిన షేక్ ఫరీదా (35), యాస్మిన్ (13)లకు అక్కడ నీటి గుంత లోతుగా ఉందనే విషయం తెలియకపోవడంతో ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లి మునిగిపోయారు. వారిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.మృతి చెందిన ఫరీదా, యాస్మిన్ వరుసకు తల్లి–కూతుళ్లు కావడంతో కుటుంబ సభ్యుల విషాదం మరింత ముదిరింది. కాసేపటి క్రితం వరకు నవ్వుతూ మాట్లాడిన వారు మృతదేహాలుగా కనిపించడంతో బంధువులు గుండెలవిసేలా రోదించారు. సంఘటన స్థలం ఒక్కసారిగా శోకసంద్రంగా మారింది.సమాచారం అందుకున్న ఉరవకొండ ఎస్సై జనార్దన్ నాయుడు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.జలాశయాలు, చెరువులు వంటి ప్రాంతాల్లో నీటి లోతు తెలియకుండా దిగడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *