రైతుల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం చేయూత!
-రైతులు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు : ఏపీఓ సావిత్రి
-ఆసక్తిగల రైతులు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోండి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని ఐదు ఎకరాల లోపు (2 50ఎకరాలు)
అర్హులైన రైతులు తమ భూముల్లో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టి, స్థిరమైన ఆదాయం పొందేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది. వివిధ రకాల పండ్ల మరియు పూల మొక్కల సాగుకు ప్రభుత్వం ఎకరాకు భారీగా ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తోంది. రైతుల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం చేయూతనిచ్చేలా
పండ్ల తోటల పెంపకానికి భారీ సబ్సిడీలు ఇస్తోంది.
ఈ పథకం ద్వారా లభించే సబ్సిడీ వివరాలు ఇలా ఉన్నాయి:
మామిడికి ఎకరానికి 70 మొక్కలు, 3 ఏళ్లకు రూ. 1,09,950, జీడిమామిడికి ఎకరానికి 70 మొక్కలు, 3 ఏళ్లకు రూ. 98,684, నిమ్మకు ఎకరానికి 110 మొక్కలు, 3 ఏళ్లకు రూ. 1,46,310, బత్తాయి/చీని పంటకు ఎకరానికి 100 మొక్కలు, 3 ఏళ్లకు రూ. 1,37,750, జామకు ఎకరానికి 110 మొక్కలు, 3 ఏళ్లకు రూ. 1,46,971, తైవాన్ జామకు ఎకరానికి 444 మొక్కలు, 3 ఏళ్లకు రూ. 2,51,224, కొబ్బరికి ఎకరానికి 60 మొక్కలు, 3 ఏళ్లకు రూ. 99,183, సాపోటకు ఎకరానికి 60 మొక్కలు, 3 ఏళ్లకు రూ. 95,585, చింతకు ఎకరానికి 40 మొక్కలు, 3 ఏళ్లకు రూ. 68,403, సీతాఫలానికి ఎకరానికి 240 మొక్కలు, 3 ఏళ్లకు రూ. 2,14,178, దానిమ్మకు ఎకరానికి 267 మొక్కలు, 3 ఏళ్లకు రూ. 2,16,417, నేరేడుకు ఎకరానికి 40 మొక్కలు, 3 ఏళ్లకు రూ. 68,163, అంజూరకు ఎకరానికి 310 మొక్కలు, 3 ఏళ్లకు రూ. 1,67,323, ఆపిల్ బేర్(పెద్ద రేగు పండ్లు)కు ఎకరానికి 320 మొక్కలు, 2 ఏళ్లకు రూ. 1,26,186, గులాబీ తోటకు 0.25 ఎకరానికి 500 మొక్కలు, 2 ఏళ్లకు రూ. 62,355, మల్లెతోటకు 0.25 ఎకరానికి 400 మొక్కలు, 2 ఏళ్లకు రూ. 55,124, మునగకు 0.25 ఎకరానికి 112 మొక్కలు, 2 ఏళ్లకు రూ. 27,515, పామాయిల్‌కు ఎకరానికి 60 మొక్కలు, 3 ఏళ్లకు రూ. 55,771, మరియు డ్రాగన్ ఫ్రూట్‌కు 0.50 ఎకరానికి 900 మొక్కలు (225 సిమెంట్ స్తంభాలు), 3 ఏళ్లకు రూ. 2,00,714 సబ్సిడీని ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
రైతులు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు: ఏపీవో సావిత్రి, డ్వామా విభాగం, రాప్తాడు.
రైతులు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు ఆర్జించవచ్చని
డ్రామా విభాగం అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ఏపీవో సావిత్రి అన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక లాభాలు గడించవచ్చు. ఎంచుకున్న పంటను బట్టి 2 లేదా 3 సంవత్సరాల పాటు మొక్కల నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి గల రైతులు ఈనెల 30వ తేదీ లోపల తమ గ్రామ లేదా మండల కార్యాలయాల్లోని ఉపాధి హామీ సిబ్బందిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి,” అని వివరించారు.


