నేరాల నియంత్రణే ధ్యేయం.. సామాన్యుడికి అండగా ఉంటాం


– అనంతపురం రూరల్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన టి. శ్రీనివాసులు

​ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : నేరాల నియంత్రణే ధ్యేయంగా పనిచేస్తామని, సామాన్యుడికి అండగా ఉంటామని అనంతపురం రూరల్ డీఎస్పీ టి.శ్రీనివాసులు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన రాప్తాడులోని రూరల్ డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఒంగోలులో డీఎస్పీగా పనిచేసి, అక్కడ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు.

అందుబాటులో పోలీస్ యంత్రాంగం

బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ అంటే భయం కాదు, భరోసా ఇచ్చేలా ఉండాలని పేర్కొన్నారు. చట్టం, న్యాయం సామాన్య ప్రజలకు గడప వద్దకే అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, అణగారిన వర్గాల సమస్యల పట్ల తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు. సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా, శాంతిభద్రతలను కాపాడటమే తన ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

నేరస్థులపై కఠిన నిఘా

రూరల్ డీఎస్పీ కార్యాలయ పరిధిలోకి వచ్చే రాప్తాడు, అనంతపురం రూరల్, ఇటుకలపల్లి, ఆత్మకూరు, బుక్కరాయ సముద్రం, నార్పల, శింగనమల, పుట్లూరు, యల్లనూరు, గార్లదిన్నె మండలాల్లో నేరాల నివారణకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిశిత దృష్టి సారించడంతో పాటు, రాత్రిపూట గస్తీని ముమ్మరం చేస్తామని వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్సహిస్తూనే, చట్టాన్ని అతిక్రమించే వారి పట్ల ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

శుభాకాంక్షల వెల్లువ

కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులును సబ్ డివిజన్ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డీఎస్పీ కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *