చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరిలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందు క్రీడా ప్రాంగాణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు హాకీ క్రీడాకారుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం నారా రామ్మూర్తినాయుడు మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ తో కలిసి బ్యాడ్మింటన్ ఆడి సందడి చేశారు. చిన్నారులతో టేబుల్ టెన్నీస్, హాకీ ఆడారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు జ్ఞాపకార్థం ఆయన పేరిట రూ.3.17 కోట్లు వెచ్చించి ఈ క్రీడా వికాస కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. జాతీయస్థాయిలో క్రీడలు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని నిర్మించారు. సీఎం చంద్రబాబు గారు విద్యాభ్యాసం చేసిన పాఠశాలలో క్రీడా వికాస కేంద్రాన్ని 2017లో మంజూరు చేశారు. గత ప్రభుత్వంలో పనులు నిలిచిపోవడంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక చొరవ తీసుకుని క్రీడా వికాస కేంద్రాన్ని తీర్చిదిద్దారు. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, క్యారమ్స్, టేబుల్ టెన్నీస్, స్కిప్పింగ్, చెస్, జిమ్, యోగా వంటి క్రీడా సదుపాయాలు, అవుట్ డోర్ లో వాలీబాల్, కబడ్డీ, కోకో, బాల్ బ్యాడ్మింటన్ కోర్టులతో పాటు హాకీ క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తీసుకుతెచ్చారు. ఈ క్రీడా వికాస కేంద్రం చంద్రగిరి పరిసర ప్రాంతాల క్రీడాకారులకు శిక్షణ, అభివృద్ధికి వేదికగా నిలవనుంది.
ఈ కార్యక్రమంలో ఏపీ రవాణ, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సి.షణ్ముగ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చంద్రగిరి నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ శ్రీపతి బాబు, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, దండు పూజ, భారత హాకీ క్రీడాకారిణి రజని ఇటిమరపు తదితరులు పాల్గొన్నారు.


