Last Updated:
అంబేద్కర్ కోనసీమలో రేణుక అనే యువతి నానమ్మ సత్యవేణి అంత్యక్రియలు స్వయంగా నిర్వహించి, పితృకర్మలు మగవారే చేయాలనే భావనను సవాలు చేసింది
కాలం మారుతోంది.. సంప్రదాయాలపై ఉన్న పాత ఆలోచనలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు అంత్యక్రియలు అంటే కేవలం మగవారే చేయాలనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆడబిడ్డలు కూడా కన్న తల్లిదండ్రులు, పెద్దల పట్ల తమ బాధ్యతను నెరవేర్చేందుకు ముందుకు వస్తున్నారు. మేము ఆడవాళ్లమే కావచ్చు.. కానీ మా ప్రేమ, మా బాధ్యత తక్కువ కాదు అని చేతల్లో చూపిస్తున్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
రాజోలు మండలం రాజోలు గ్రామంలోని సుందరమ్మ చెరువు గట్టు ప్రాంతానికి చెందిన గాలిదేవర సత్యవేణి (75) కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఆమెకు కుమారుడు లేకపోవడం కాదు.. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాస్‌రావు 2021లో కరోనా మహమ్మారి కారణంగా మరణించాడు. ఆ తర్వాత ఈ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది ఆయన చిన్న కుమార్తె రేణుక. ప్రస్తుతం అవివాహితగా నానమ్మతోనే ఉంటున్న ఆమె.. నానమ్మ మృతితో తీవ్ర భావోద్వేగానికి గురైంది.
అంత్యక్రియల సమయంలో కుటుంబంలో మగవారు లేకపోవడంతో రేణుక ధైర్యంగా ముందుకొచ్చింది. కన్నీళ్లు ఆపుకుంటూనే నానమ్మకు తలకొరివి పెట్టి చివరి సంస్కారాలు నిర్వహించింది. నా తండ్రి ఉండి ఉంటే ఈ బాధ్యత ఆయనదే.. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన స్థానంలో నేనే ఈ కర్తవ్యం చేస్తున్నా అంటూ రేణుక కన్నీటి పర్యంతమైంది. తన తండ్రి కరోనా సమయంలో మరణించగా చివరి చూపు కూడా చూడలేకపోయానని గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
స్మశానానికి వెళ్లి నానమ్మకు తలకొరివి పెట్టిన రేణుకను చూసిన గ్రామస్తులు, బంధువులు భావోద్వేగానికి గురయ్యారు. పేగు బంధానికి ఆడ, మగ అనే తేడా ఉండదని.. ప్రేమ, బాధ్యతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి చాటి చెప్పిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మగబిడ్డలే పితృరుణం తీర్చాలి అనే పాత ఆలోచనలకు భిన్నంగా.. ఇప్పుడు ఆడబిడ్డలూ కుటుంబ బాధ్యతలను ధైర్యంగా తీసుకుంటున్నారని చెబుతున్నారు.
సామాజికంగా మారుతున్న పరిస్థితుల్లో ఆడబిడ్డలు ప్రతి రంగంలో ముందంజలో నిలుస్తున్న సమయంలో.. ఇలాంటి ఘటనలు సమాజానికి కొత్త సందేశాన్ని ఇస్తున్నాయని స్థానికులు అంటున్నారు. కన్నవారిని చివరి ప్రయాణంలో సాగనంపడం ప్రేమకు, బంధానికి సంబంధించిన విషయం తప్ప లింగభేదానికి కాదని రేణుక చేసిన పని ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


