తెలంగాణలో ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారికి కీలక సమాచారం.రాష్ట్రంలో వ్యవసాయ భూములు,నివాస స్థలాలు,గృహ సముదాయాలు,వాణిజ్య భవనాల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం నిర్ణయించే మార్కెట్ విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.సవరించిన ఈ కొత్త విలువలు మే మొదటి వారం నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.దీంతో ఆస్తులు కొనుగోలు చేసే వారికి స్టాంప్ డ్యూటీ,రిజిస్ట్రేషన్ చార్జీలు గణనీయంగా పెరగనున్నాయి.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
గత శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో దీనికి ఆమోదం లభించింది.
మార్కెట్ విలువలను సవరించి కొత్త రేట్లను అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు, సాంకేతిక ఏర్పాట్లు చేయాలని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖకు ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువలు,బహిరంగ మార్కెట్లో ఉన్న వాస్తవ ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు.ఈ చర్యతో ఆస్తుల లావాదేవీలలో నల్లధనం వినియోగం తగ్గి, పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సవరణ వల్ల రిజిస్ట్రేషన్ల శాఖకు సుమారు రూ.2,000 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. డిసెంబర్ 2023లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ విలువలను సవరించడం ఇదే మొదటిసారి. అంతకుముందు 2021లో అప్పటి ప్రభుత్వం ఈ విలువలను పెంచింది.
వాస్తవానికి ఏడాది క్రితమే పెంపు ప్రతిపాదన ఉన్నప్పటికీ, స్థిరాస్తి రంగంలో ఏర్పడిన మందగమనం కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు.


