ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్‌లో నవ్వులాటలు


గాల్లో మేడలు కడుతున్నారని ఎగతాళి

తెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారంతో అంటారో, అతితెలివితో మాటాడుతారో తెలీడు. ఆయన ప్రకటనలు, సోషల్ మీడియాలో పోస్టులు చాలా విడ్డూరంగా ఉంటాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మీడియా ఎగతాళి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారని ఇరాన్ మీడియా వెక్కిరించింది. ఇరాన్ తో ఒప్పందానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేసింది. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… ఇరాన్‌తో త్వరలో ఓ ఒప్పందం కుదరనుందని తెలిపారు. దీంతో వారు మాకు ఉచితంగా చమురు, హోర్మూజ్ జలసంధిని అందించనున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ఉతికి ఆరేసింది. ట్రంప్ మాట్లాడుతున్న వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసింది. దీనికి ‘అమెరికా అధ్యక్షుడు గాల్లో మేడలు కడుతున్నారు’ అని పేర్కొంది. ఈ సందర్భంగా ట్రంప్ ఎక్కువగా ఊహించుకుని, తప్ప్పులకు పాల్పడుతున్నారనే ఉద్దేశం వచ్చేలా ఒక సామెతను కూడా అది ప్రస్తావించింది. ఆయన ప్రకటనలు, వ్యాఖ్యలకు ఏమాత్రం విలువలేదని కొట్టిపారేసింది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఈ వాదనలను కొట్టిపారేసింది. ఇప్పటివరకు అలాంటి ఒప్పందం ఏదీ జరగలేదని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ట్రంప్ మరో అబద్ధపు ప్రకటన చేశారని తెలిపాయి. అలాంటి పెద్ద పురోగతి ఏదీ సాధించలేదని, ఇరాన్ షరతులన్నింటికీ అమెరికా అంగీకరిస్తేనే చర్చలు కొనసాగుతాయని స్పష్టంచేశాయి. మా షరతులకు లోబడే తాము ముందుకు వెళతామని తెగేసి చెప్పింది.

The post ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్‌లో నవ్వులాటలు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *