ట్రంప్ నాన్చుడు…తొలగని ఉత్కంఠ – Visalaandhra


ఇరాన్‌తో ఒప్పందంపై వీడని ప్రతిష్టంభన
వాషింగ్టన్:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలపై ఎటూ తేల్చక నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారు. యుద్ధ విరమణను మరో 60 రోజులు పొడిగించేందుకు, హోర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. శ్వేతసౌధంలోని సిచ్యుయేషన్ రూమ్‌లో తన సలహాదారులతో సమావేశమైన ట్రంప్…ఒప్పందంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమంపైనే ఎక్కువ చర్చ జరిగింది. ఈ అణు కార్యక్రమాన్ని ఆపితేనే తుది ఒప్పందం కుదురుతుందని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. అణుబాంబు తయారు చేయనన్న హామీ ఇరాన్ ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. తెహ్రాన్ మాత్రం ఇందుకు ససమేమిరా అంటోంది. ‘మేం యుద్ధం ముగించే అంశంపైనే దృష్టి పెట్టాం. ప్రస్తుతం అణు ప్రణాళికపై చర్చించడం లేదు’ అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఏ ఒప్పందం కుదిరినా…అందులో ఇజ్రాయిల్, హెజ్‌బొల్లా మధ్య సంధి కూడా ఉండాలని ఇరాన్ పట్టుబడుతోంది. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోకి ఇజ్రాయిలీ సైన్యం చొచ్చుకుపోతోంది. నబాటియా నగరం దిశగా ఆ దేశ సైనికులు కదులుతున్నారు. నబాటియా… లెబనాన్‌లో ఐదో అతి పెద్ద నగరం. అంతేకాదు… హెజ్‌బొల్లా గట్టి మద్దతుదారులు ఉన్న ప్రాంతం కూడా. ఇజ్రాయిల్ దాడుల్లో దక్షిణ లెబనాన్‌లో ముగ్గురు చనిపోయారు. ఉత్తర ఇజ్రాయిల్‌లోని పలు ప్రాంతాలపై శనివారం హెజ్‌బొల్లా రాకెట్ల దాడులు కొనసాగాయి. హోర్మూజ్‌పై తాము కొనసాగిస్తున్న దిగ్బంధనాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించిన ఓ వాణిజ్య నౌకను అడ్డుకున్నామని అమెరికా సైన్యం శనివారం తెలిపింది. ఇలా ఇరు దేశాలు పట్టుతోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా మరింత ఉత్కంఠ నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *