–పట్టుదలతో ముందడుగు… ఐఐటీ లక్ష్యంగా విజయయాత్ర
–ఎస్సీ కేటగిరిలో 2165 ర్యాంకు
జేఈఈ అడ్వాన్స్డ్–2026లో ఎస్సీ కేటగిరిలో 2165 ర్యాంకు సాధించిన ఆస్పరి విద్యార్థి మూలింటి సాహు భీమ్
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా ): గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించగలరని నిరూపిస్తూ ఆస్పరి కి చెందిన మూలింటి సాహూ భీమ్ జేఈఈ అడ్వాన్స్డ్-2026లో ఎస్సీ కేటగిరిలో,2165 ర్యాంకు సాధించి ప్రతిభ చాటాడు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన భీమ్ కష్టపడి చదివి ఐఐటీలో ప్రవేశానికి అర్హత సాధించడం విశేషం. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన భీమ్ జాతీయ స్థాయి పోటీ పరీక్షలో ర్యాంకు సాధించడం ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని నింపింది. సాహు భీమ్ తండ్రి మూలింటి నాగన్న జర్నలిస్టుగా, తల్లి జయలక్ష్మి గృహిణిగా ఉన్నారు. “చదువే జీవితాన్ని మార్చగల శక్తి” అనే నమ్మకంతో తమ ఇద్దరు కుమారులను విజయవాడలో ఉన్నత విద్యాభ్యాసం చేయిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పిల్లల విద్య విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ప్రోత్సహించారు. సాహు భీమ్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూపులో 956 మార్కులు సాధించాడు. అనంతరం జేఈఈ మెయిన్స్‌లో 92.82 పర్సంటైల్ సాధించి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందాడు. క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక, నిరంతర సాధన, కాన్సెప్ట్లపై పట్టు సాధించడమే తన విజయానికి కారణమని చెబుతున్నాడు.
పదో తరగతి నుంచే లక్ష్యం..
ఇంజినీరింగ్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే సంకల్పంతో పదో తరగతి నుంచే జేఈఈపై దృష్టి సారించాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ప్రతిరోజూ నిర్దిష్ట సమయ పట్టిక ప్రకారం అధ్యయనం చేస్తూ, గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు, మాక్ టెస్టులు, అధ్యాపకులు సూచించిన రిఫరెన్స్ పుస్తకాలను క్రమం తప్పకుండా అభ్యసించాడు. ప్రతి పరీక్ష అనంతరం తన తప్పులను విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకోవడం ద్వారా ప్రతిభను మెరుగుపరుచుకున్నాడు. “విజయం ఒక్కరోజులో రాదు. ప్రతి రోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే గొప్ప విజయాలకు పునాది వేస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, లక్ష్యంపై దృష్టి నిలపడం, అపజయాలను అవకాశాలుగా మలచుకోవడం విద్యార్థుల విజయానికి కీలకం” అని సాహు భీమ్ పేర్కొన్నాడు.
ఐఐటీ నుంచి సివిల్స్ వరకు లక్ష్యం
ఐఐటీలో, ముఖ్యంగా ఐఐటి మద్రాస్‌లో మంచి బ్రాంచ్‌లో ప్రవేశం పొంది అత్యుత్తమ జీపీఏతో విద్యాభ్యాసం పూర్తి చేయాలని సాహు భీమ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనంతరం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమై భారత పరిపాలనా సేవల్లో చేరి కలెక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలనే ఆశయాన్ని వ్యక్తం చేశాడు.
తల్లిదండ్రుల ప్రోత్సాహమే విజయానికి బలం
తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకత్వం, స్వీయ కృషే కారణమని సాహు భీమ్ తెలిపాడు. ప్రతి దశలో ధైర్యం చెప్పి ముందుకు నడిపిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆస్పరి విద్యార్థి జాతీయ స్థాయి పోటీ పరీక్షలో ర్యాంకు సాధించడం మండలంలోని యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.


