జాతికి అంకితం కానున్న 3 అత్యాధునిక నౌకలు.. నేవీకి మరింత బలం


భారత నౌకాదళం మరింత శక్తివంతం కానుంది. శత్రు దేశాల కదలికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన మూడు అత్యాధునిక నౌకలను నేవీలోకి తీసుకురానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21న కోల్‌కతాలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌, ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌, ఐఎన్‌ఎస్‌ దుణగిరి నౌకలను జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం తూర్పు నౌకాదళం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌..
కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థలో నిర్మించిన ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌ యాంటీ సబ్‌మెరైన్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌గా రూపుదిద్దుకుంది.77.6 మీటర్ల పొడవు కలిగిన ఈ యుద్ధనౌకను 2024 మార్చి 13న జలప్రవేశం చేశారు.తీర ప్రాంత జలాల్లో కార్యాచరణలకు అనువుగా దీన్ని రూపొందించారు.ఉపరితల నిఘా, శత్రు జలాంతర్గాముల అన్వేషణ, అవసరమైతే దాడులు నిర్వహించడంతో పాటు స్వదేశీ విమానాలతో సమన్వయం చేసుకునే సామర్థ్యం దీనికి ఉంది.
సుమారు 88 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ నౌకలో 30 ఎంఎం నేవల్‌ సర్ఫేస్‌ గన్‌తో పాటు వాటర్‌ జెట్లకు అనుసంధానించిన డీజిల్‌ ఇంజిన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఐఎన్‌ఎస్‌ సంశోధక్
భారత నౌకాదళ హైడ్రోగ్రాఫిక్‌ సర్వే సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌ను నిర్మించారు.సముద్ర భౌగోళిక పరిస్థితులు, తీర ప్రాంత జలాల కొలతలు, సముద్ర పటాల రూపకల్పన, నావిగేషన్‌కు అవసరమైన చార్టుల తయారీలో ఈ నౌక కీలక పాత్ర పోషించనుంది.110 మీటర్ల పొడవు గల ఈ నౌకను 2023 జూన్‌ 13న జలప్రవేశం చేశారు.పోర్టులు, సముద్ర మార్గాలు, మారిటైం పరిధిలో సమగ్ర అధ్యయనాలు నిర్వహించేందుకు దీనిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.హెలికాప్టర్‌ కార్యకలాపాలకు అనువైన సదుపాయాలతో పాటు, ప్రకృతి విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో మానవీయ సాయం, సహాయక చర్యలు చేపట్టే సామర్థ్యం కూడా దీనికి ఉంది.

ఐఎన్‌ఎస్‌ దుణగిరి
భారత నేవీలో విశిష్ట సేవలు అందించిన నీలగిరి శ్రేణి నౌకల స్ఫూర్తితో ఐఎన్‌ఎస్‌ దుణగిరిని నిర్మించారు.
ప్రాజెక్ట్‌-17ఏ కింద రూపొందించిన ఈ అత్యాధునిక యుద్ధనౌకను 2022 జులై 15న జలప్రవేశం చేశారు.
దీని పొడవు 149 మీటర్లు. అడ్వాన్స్‌డ్‌ గైడెడ్‌ మిసైల్‌ ఫ్రిగేట్‌గా రూపొందించిన ఈ నౌక అత్యాధునిక రాడార్లు, సెన్సర్లతో బహుముఖ విధులు నిర్వహించేలా సన్నద్ధమైంది.బ్రహ్మోస్‌ యాంటీ క్రూయిజ్‌ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం దీని ప్రధాన ప్రత్యేకత. సముద్ర యుద్ధాల్లో భారత నౌకాదళానికి మరింత బలం చేకూర్చే సామర్థ్యం ఈ నౌకకు ఉంది.

నౌకాదళానికి మరింత బలం
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మూడు నౌకలు భారత నౌకాదళ ఆధునికీకరణలో కీలక మైలురాయిగా నిలవనున్నాయి. సముద్ర భద్రత, శత్రు కదలికలపై నిఘా, సముద్ర అధ్యయనం, మానవీయ సహాయక చర్యలు, అత్యాధునిక యుద్ధ సామర్థ్యాల పరంగా నేవీ బలాన్ని మరింత పెంచనున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *