జర్నలిస్టులపై బెదిరింపులు సహించేది లేదు


భారత్ పెట్రోలియం బంకు నిర్వాహకులపై ఏపీ డబ్ల్యూజేఎఫ్ ఆగ్రహం

విశాలాంధ్ర-​రాప్తాడు : నిజాలు నిక్కచ్చిగా రాసే పత్రికా విలేకరులపై దౌర్జన్యం చేయడం, ఫోన్లలో బెదిరింపులకు దిగడం అత్యంత అనైతికమని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షుడు పామాల కొండప్ప ఆలియాస్ కొండారెడ్డి తీవ్రంగా ఖండించారు. రాప్తాడు హైవే జంక్షన్‌లోని భారత్ పెట్రోలియం బంకు నిర్వాహకుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు హైవే జంక్షన్‌లో ఉన్న భారత్ పెట్రోలియం బంకులో తగినంత ఇంధన నిలువలు ఉన్నప్పటికీ, నిర్ణీత సమయ పాలన పాటించకుండా నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనిపై వార్త రాసేందుకు, ఫొటోలు తీసేందుకు ‘విశాలాంధ్ర’ రాప్తాడు రిపోర్టర్ శ్రీనివాసులు వెళ్లారు. ఈ క్రమంలో బంకు నిర్వాహకుడు స్వరూప్.. తనకు తెలిసిన గోవిందరాజులు అనే వ్యక్తితో విలేకరి శ్రీనివాసులకు ఫోన్ చేయించి బెదిరింపులకు దిగారు.
​ఈ ఘటనపై పామాల కొండప్ప స్పందిస్తూ, బంకులో ఉండాల్సిన మౌలిక వసతులు, సమయ పాలన అన్నీ సక్రమంగా ఉంటే ఇతరులతో ఫోన్లు చేయించి బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తప్పులను ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు దిగడం తగదన్నారు. సదరు బంకు నిర్వాహకులు తక్షణమే విలేకరి శ్రీనివాసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బంకు ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

The post జర్నలిస్టులపై బెదిరింపులు సహించేది లేదు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *