ఖరీఫ్‌కు ఎల్‌నినో ఎఫెక్ట్‌..16 జిల్లాల్లో లోటు వర్షపాతం


ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచే ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది.
జూన్‌ 1 నుంచి జులై 5 వరకు నమోదైన వర్షపాత గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈ కాలంలో సాధారణంతో పోలిస్తే 28.9 శాతం తక్కువ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాల కొరత కనిపించింది.
ఈ రెండు జిల్లాల్లో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53.4 శాతం తక్కువ వర్షం నమోదైంది.
కొన్ని మండలాల్లో మాత్రమే ఆశాజనకంగా వర్షాలు కురవడంతో అక్కడ ఖరీఫ్‌ సాగు ప్రారంభమైంది.
అయితే మరికొన్ని ప్రాంతాల్లో జూన్‌ తొలి రోజుల్లో వర్షాలు పడినా, ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు పంటల సాగును ప్రారంభించలేకపోయారు.

26 మండలాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని మొత్తం 688 మండలాల్లో 404 మండలాలకు తక్కువ వర్షపాతం నమోదైంది.
వీటిలో 265 మండలాల్లో లోటు వర్షపాతం ఉండగా,మరో 139 మండలాలు తీవ్ర లోటు వర్షపాతాన్ని నమోదు చేశాయి. మరోవైపు 284 మండలాల్లో మాత్రం వర్షాలు అనుకూలంగా కురిశాయి.
వీటిలో 26 మండలాల్లో భారీ వర్షాలు,76 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం, 182 మండలాల్లో సాధారణ స్థాయి వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో ఇప్పటివరకు 4.65 లక్షల ఎకరాల్లో పత్తి, 3.62 లక్షల ఎకరాల్లో వరి, 1.18 లక్షల ఎకరాల్లో కంది, 66 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలను సాగు చేశారు. మొత్తం 12 జిల్లాల్లో సాధారణంతో పోలిస్తే ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం పెరిగినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు వెల్లడించాయి.

కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఆశాజనకం
మరోవైపు పోలవరం, గుంటూరు, మార్కాపురం,అన్నమయ్య, ప్రకాశం,అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో సాధారణంతో పోలిస్తే 80 శాతం కంటే ఎక్కువ మేర సాగు విస్తీర్ణం తగ్గింది. అలాగే బాపట్ల,అనకాపల్లి,చిత్తూరు, తూర్పుగోదావరి,పార్వతీపురం మన్యం,అనంతపురం, వైఎస్సార్‌ కడప,నంద్యాల జిల్లాల్లో సాధారణం కంటే 30 నుంచి 79 శాతం వరకు తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అయితే కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌ సాగు మెరుగ్గా కొనసాగుతున్నట్లు వ్యవసాయశాఖ నివేదికలు పేర్కొన్నాయి. కాకినాడ జిల్లాలోనూ సాధారణంతో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగింది. శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, పల్నాడు, విశాఖపట్నం, శ్రీసత్యసాయి, కృష్ణా జిల్లాల్లో కూడా పంటల సాగు సాధారణ స్థాయిని మించి నమోదైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *