లాడ్లాపూర్ (కర్ణాటక): కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబుర్గి జిల్లాలోని లాడ్లాపూర్ సమీపంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళ్తున్న క్రూజర్ వాహనం ముందున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లాడ్లాపూర్ దగ్గర లారీని క్రూజర్ వాహనం ఢీకొట్టడంతో ఐదుగురు మృతిచెందారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను క్యాష్వార్, హుస్సేన్, అలీ, రసూల్, ఫాతిమాగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో క్రూజర్ వాహనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్కసారిగా కుటుంబంలోని ఐదుగురు మృతిచెందడంతో బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం ప్రాణాంతకమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా నిండు ప్రాణాలు రోడ్డుపాలవుతున్నాయి.


