ఏపీలో ఇంధన కొరతపై చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్


రాష్ట్రంలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష
క్షేత్రస్థాయిలో సరఫరాను పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశం

రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ఆయన సోమవారం నాడు కూడా ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తెచ్చేందుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు తక్షణమే ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు స్వయంగా వెళ్లి సరఫరాను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో పరిస్థితులను ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం గమనిస్తూ, ప్రతీ 3 గంటలకు ఒకసారి తనకు నివేదిక అందించాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ట్యాంకర్లు ఎలాంటి జాప్యం లేకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు పాల్పడినా, కృత్రిమ కొరత సృష్టించాలని చూసినా వారిపై కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *