హైదరాబాద్: ‘ఏక్ దిన’ కథపై తనకు నమ్మకం ఉందని బాలీవుడ్ నటుడు, నిర్మాత అమీర్ ఖాన్ అన్నారు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో తెలియదు. కానీ, దీని విషయంలో చిత్రబృందం మాత్రం సంతోషంగా ఉందన్నారు. అమీర్ ఖాన్ నిర్మాతగా… తన కుమారుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా రూపొందించిన చిత్రం ‘ఏక్ దిన’. తెలుగులో ‘ఒక రోజు’ టైటిల్‌తో రానుంది. సునీల్ పాండే తెరకెక్కించిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీర్ ఖాన్ మాట్లాడుతూ… ‘నిజానికి ‘ఏక్ దిన’ చాలా చిన్న సినిమా. ఇందులో కొత్త నటీనటులున్నారు. జునైద్ తన కెరీర్‌ను ఇప్ప్పుడే ప్రారంభించాడు. హిందీలో సాయి పల్లవి నటించిన తొలి చిత్రమిది. కాబట్టి ఈ సినిమాకు ఆదరణ లభించడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుందని భావించాను. అందుకే ప్రచారం త్వరగా ప్రారంభిచాలనుకున్నా. ఇది నేను నమ్మే కథ. నేను కూడా భావోద్వేగాలకు సులభంగా లోనయ్యే ప్రేక్షకుణ్నే. దర్శకుడు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. విజయం సాధిస్తుందో లేదో ఎవరికీ తెలియదు. నేను ఆలోచించే ముఖ్యమైన విషయం ఏంటంటే…మనం కథకు ప్రాణం పోసి చూపించగలిగామా లేదా అన్నదే. నా దృష్టిలో విజయానికి అదే మొదటి కొలమానం. వాస్తవానికి సినిమా విజయాన్ని అర్థం చేసుకోవడానికి వసూళ్లు ముఖ్యమే కానీ, నచ్చని సినిమా బాగా ఆడితే ఆ విజయంతో నేను సంతోషంగా ఉండలేను’ అని అమీర్ ఖాన్ అన్నారు.
The post ‘ఏక్‌దిన’పై నాకు నమ్మకం ఉంది: అమీర్ ఖాన్ appeared first on Visalaandhra.


