ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో.. కొత్తగా మూడు వ్యాక్సిన్ల అభివృద్ధి


ఎబోలా వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, ప్రస్తుతం దాదాపు 250 మందిని బలిగొన్న అరుదైన బుండిబుగ్యో రకాన్ని ఎదుర్కొనేందుకు మూడు కొత్త వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి.ఇంటర్నేషనల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ (IAVI), ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ప్రముఖ ఔషధ సంస్థ మోడెర్నా ఈ వ్యాక్సిన్ల అభివృద్ధిపై పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.ఈ మూడు ప్రాజెక్టులకు కోలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్ ఆర్థిక సహాయం అందిస్తోంది.

వెయ్యి దాటిన అనుమానిత కేసులు.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఎబోలా
ప్రస్తుతం కాంగో ప్రజాస్వామ్య గణరాజ్యంలో (డీఆర్ కాంగో) వెయ్యికి పైగా అనుమానిత ఎబోలా కేసులు నమోదవగా, పొరుగు దేశమైన ఉగాండాలో తొమ్మిది నిర్ధారిత కేసులు వెలుగుచూశాయి. పరిమిత వైద్య సదుపాయాలు ఉన్న ఘర్షణ ప్రాంతంలో వైరస్ ఇప్పటికే వ్యాపించిన తర్వాతే ఈ వ్యాధిని గుర్తించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. దీంతో 2014-16 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో సంభవించిన అతిపెద్ద ఎబోలా మహమ్మారిని ఈసారి మించి ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ సమయంలో దాదాపు 29 వేల మంది వైరస్ బారిన పడగా, 11 వేల మందికి పైగా మరణించారు.

ఎబోలా విజృంభణపై హెచ్చరికలు
ఐఏవీఐ అధిపతి డాక్టర్ మార్క్ ఫైన్‌బర్గ్ మాట్లాడుతూ, ఈ వ్యాప్తి గతంలో నమోదైన తీవ్రమైన ఎబోలా మహమ్మారితో సమానంగా లేదా అంతకంటే ప్రమాదకరంగా మారే అవకాశముందని తెలిపారు.
అందుకే వ్యాక్సిన్ అభివృద్ధిని అత్యవసరంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వైద్య సేవా సంస్థ మెడిసిన్స్ సాన్స్ ఫ్రంటియర్స్ కూడా పరిస్థితిని తీవ్ర ఆందోళనకరంగా అభివర్ణించింది.
ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని పేర్కొంది.

బుండిబుగ్యో ఎబోలాకు ఇంకా వ్యాక్సిన్ లేదు.. కొత్త టీకాపై ఆశలు
ఎబోలా వైరస్‌కు మొత్తం ఆరు రకాలున్నప్పటికీ,వాటిలో మూడు మాత్రమే పెద్ద స్థాయిలో వ్యాప్తి చెందుతాయి. ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్న జైర్ర కానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఈసారి వ్యాప్తి చెందుతున్న బుండిబుగ్యో రకానికి ఇప్పటివరకు ఆమోదం పొందిన వ్యాక్సిన్ లేదు. గతంలో ఈ రకం కేవలం రెండుసార్లు మాత్రమే కనిపించింది. ఈ నేపథ్యంలో ఐఏవీఐ,ఇప్పటికే ఉన్న జైర్ ఎబోలా వ్యాక్సిన్‌ను సవరించి బుండిబుగ్యో రకాన్ని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది.
కోతులపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ టీకా దాదాపు 100శాతం రక్షణ కల్పించినట్లు గుర్తించారు.
అయితే మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు మరో 7 నుంచి 9 నెలల సమయం పట్టే అవకాశం ఉందని,ఆ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫైన్‌బర్గ్ తెలిపారు.

బుండిబుగ్యో ఎబోలాకు కొత్త టీకాల అభివృద్ధి
ఇక మోడెర్నా సంస్థ కోవిడ్ మహమ్మారి సమయంలో విజయవంతంగా ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో బుండిబుగ్యో వ్యాక్సిన్‌ను రూపొందిస్తోంది. అవసరమైన ప్రాంతాలకు త్వరగా వ్యాక్సిన్ అందించేందుకు అత్యవసర చర్యలు తీసుకుంటామని మోడెర్నా సీఈఓ స్టీఫెన్ బాన్సెల్ వెల్లడించారు. మరోవైపు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కూడా కోవిడ్ సమయంలో ఉపయోగించిన తన వ్యాక్సిన్ సాంకేతికత ఆధారంగా కొత్త ఎబోలా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ టీకా రెండు నుంచి మూడు నెలల్లో క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమవుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ మూడు వ్యాక్సిన్ల లక్ష్యం వైరస్ ఉపరితలంపై ఉండే బుండిబుగ్యో గ్లైకోప్రోటీన్‌ను గుర్తించి దానిపై శరీర రోగనిరోధక వ్యవస్థను స్పందించేలా చేయడమే.

క్లినికల్ పరీక్షలతో తేలనున్న ప్రభావం
అయితే వీటిలో ఉపయోగిస్తున్న సాంకేతికతలు వేర్వేరుగా ఉండటంతో రక్షణ స్థాయి, అవసరమయ్యే డోసుల సంఖ్య వంటి అంశాలు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. వీటిపై క్లినికల్ పరీక్షల ద్వారా స్పష్టత రానుంది. సీఈపీఐ సీఈఓ డాక్టర్ రిచర్డ్ హాచెట్ మాట్లాడుతూ, బుండిబుగ్యో వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, ప్రస్తుతం ఎటువంటి లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ప్రతి రోజు ఎంతో కీలకమని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేసస్ మాట్లాడుతూ, బుండిబుగ్యో వ్యాక్సిన్ ఈ మహమ్మారిని నియంత్రించడంలోనే కాకుండా భవిష్యత్ ఎబోలా వ్యాప్తులను ఎదుర్కొనేందుకు కూడా కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *