ఎఫ్‌ఎంసీ విధానానికి ముగింపు.. ఆటో మ్యుటేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వంగా సంక్రమించిన భూముల మ్యుటేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కుటుంబ సభ్యుల మధ్య వారసత్వ ఆస్తుల విభజనకు సంబంధించిన దస్తావేజులు రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యుటేషన్ కూడా స్వయంచాలకంగా జరిగే విధానాన్ని అమలు చేయాలని సీసీఎల్‌ఏ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంతకుముందు వారసత్వ భూముల మ్యుటేషన్ కోసం కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం (ఎఫ్‌ఎంసీ) ఆధారంగా స్వర్ణ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉండేది.
అనంతరం రెవెన్యూ అధికారుల పరిశీలన తర్వాత మ్యుటేషన్ ప్రక్రియ పూర్తయ్యేది.
ఈ విధానంలో ప్రజలు పలుమార్లు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణకు నో..
కొత్త విధానం అమల్లోకి రావడంతో, కుటుంబ సభ్యులు వారసత్వ ఆస్తులను పరస్పర అంగీకారంతో విభజించుకుని, ఆ విభజన దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేయించగానే మ్యుటేషన్ స్వయంచాలకంగా పూర్తవుతుంది. తద్వారా సంబంధిత భూమి వివరాలు రెవెన్యూ రికార్డుల్లో వెంటనే నమోదు అవుతాయి.
ఇకపై స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం (ఎఫ్‌ఎంసీ) ఆధారంగా మ్యుటేషన్ దరఖాస్తులను స్వీకరించరు. అయితే, వీలునామా (విల్) లేకుండా మరణించిన వ్యక్తుల వారసులు ఆస్తుల పంపిణీ దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం (ఎఫ్‌ఎంసీ)ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఎసైన్డ్ భూముల విషయంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం 20 సంవత్సరాల కాలపరిమితి పూర్తైన తర్వాత మాత్రమే ఈ సౌకర్యం వర్తింపజేయబడుతుంది.

The post ఎఫ్‌ఎంసీ విధానానికి ముగింపు.. ఆటో మ్యుటేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *