Last Updated:
కాకినాడ లోవ అటవీ ప్రాంతం లోవకొత్తూరులో తలుపులమ్మ చైత్ర జాతర వైభవంగా జరిగింది, రథోత్సవం సహా మూడు రోజుల వేడుకలకు లక్షలాది భక్తులు హాజరయ్యారు
కొండకోనల్లో అటవీ సోయగాల మధ్య వెలసిన తలుపులమ్మ అమ్మవారి క్షేత్రంలో చైత్ర మాస జాతర మహోత్సవాలు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా సాగాయి. ప్రకృతి మధ్యలో స్వయంభుగా వెలసిన అమ్మవారి సన్నిధిలో మూడు రోజుల పాటు జరిగే ఈ జాతర భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే యమబాధలు కూడా తొలగిపోతాయని స్థానిక విశ్వాసం.
కాకినాడ జిల్లా లోవ అటవీ ప్రాంతంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందింది. ఆదివారం, మంగళవారం, గురువారం వంటి ప్రత్యేక దినాల్లో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. అటవీ ప్రాంతంలోనే వంటావార్పు చేసుకుని ప్రసాదాలను స్వీకరించడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
ప్రతి ఏడాది అమావాస్య సందర్భంగా సుమారు 15 రోజుల పాటు జాతర జరుగుతుండగా, అందులో ప్రధానంగా మూడు రోజులు అమ్మవారి పుట్టింటి గ్రామమైన లోవకొత్తూరులో అత్యంత ఘనంగా నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ మూడు రోజుల్లో గ్రామం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది.
లోవకొత్తూరులోని ఆలయ ప్రాంగణం విద్యుత్ కాంతులతో అలంకరించబడగా, కోలాటాలు, నృత్యాలు, ప్రత్యేక వేషధారణలు జాతరను మరింత రంగురంగులంగా మార్చాయి. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి, ఉప కమిషనర్ పెనుమత్సు విశ్వనాథరాజు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
జాతర చివరి రోజు నిర్వహించిన రథోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దాదాపు 11 రథాలపై వివిధ దైవమూర్తులను ప్రతిష్టించి గ్రామమంతా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ దృశ్యం భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గ్రామంలోని ప్రతి వీధిలో భక్తులు ఈ రథాలను దర్శించుకుని అమ్మవారి కటాక్షం పొందారు.
ఈ చైత్ర మాస జాతరలో అమ్మవారిని దర్శించడం ద్వారా యమబాధలు సైతం తొలగిపోతాయని ఆలయ ప్రధాన అర్చకులు త్రినాధ రావు తెలిపారు. అటవీ మధ్యలో జరిగే ఈ జాతర భక్తి, సంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రతి ఏటా మరింత వైభవంగా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


