ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కుతున్నారు – Visalaandhra


వెంక గారి భూమయ్య

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేడు సంక్షోభపు అంచున నిలిచింది. హామీల అమలులో మొండిచేయి, బకాయిల చెల్లింపులో మీనమేషాలు లెక్కించడం ఈ రెండూ కలిపి వేలాది మంది కార్మికుల భవిష్యత్తునే అనిశ్చితిలోకి నెట్టేశాయి. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో 45 వేల మంది కార్మికులను రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది కేవలం వేతనాల కోసం చేసే పోరాటం కాదు. ఇది వారి ఉనికిని కాపాడుకునే ప్రయత్నం అని చెప్పొచ్చు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘సకల జనుల సమ్మె’కు వెన్నెముకగా నిలిచిన ఆర్టీసీ కార్మికులు, నేడు అదే స్వరాష్ట్రంలో తమ హక్కుల కోసం వేడుకోవాల్సిన పరిస్థితి రావడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. మార్చి 13న సమ్మె నోటీసు ఇచ్చినా, ప్రభుత్వ యంత్రాంగం కనీస చొరవ చూపకపోవడం కార్మికుల సహనాన్ని పరీక్షించడమే. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తామన్న జేఏసీ నిర్ణయం వెనుక దశాబ్దాల నిర్లక్ష్యం దాగి ఉంది. ఆర్టీసీలో అత్యంత ఆందోళనకర అంశం కార్మికుల నిధుల దుర్వినియోగం. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సీసీఎస్) , ప్రావిడెంట్ ఫండ్ నిధులను వారి అనుమతి లేకుండా ఇతర అవసరాలకు మళ్లించడం అనైతిక చర్య.దాదాపు 1,200 కోట్ల బకాయిలు పేరుకుపోవడం వల్ల రిటైర్డ్ సిబ్బంది తమ ప్రాథమిక అవసరాలకే ఇబ్బంది పడుతున్నారు. 2015 నుంచి పూర్తి స్థాయి వేతన సవరణ (పీఆర్‌సీ) లేకపోవడం, 11వ పీఆర్సీ అమలులో జాప్యం ఇవి కార్మిక కుటుంబాలను ఆర్థికంగా కుదేలును చేశాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే డ్రైవర్, కండక్టర్‌కి రూ.19,000 ప్రారంభ వేతనం అనేది వారి కష్టానికి తగిన ఫలితం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా దష్టి పెట్టి కనీసం 30% ఫిట్‌మెంట్ ప్రకటించడం అత్యవసరం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం లేదు. నష్టాల పేరుతో ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయన్న అనుమానం కార్మికుల్లో పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం సాధ్యమైతే, తెలంగాణలో ఎందుకు కాదు అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. 2019 సమ్మె సమయంలో ఇచ్చిన హామీ ఏమైంది ? ప్రైవేట్ ఆపరేటర్లకు మార్గం చూపిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ సేవలు అనేవి ఇక కనిపించవు. దాంతో పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి విలీనం అనేది కార్మికుల కోసమే కాదు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కూడా అవసరం..కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ఆర్టీసీ సిబ్బంది సేవలందించారు. వలస కూలీలను సురక్షితంగా గమ్యాలకు చేర్చడంలో వారి పాత్ర అపూర్వం. అప్పుడు వారిని ‘ఫ్రంట్‌లైన్ వారియర్స’గా కీర్తించిన ప్రభుత్వం, నేడు వారి సమస్యలపై ఎందుకు మౌనం వహిస్తోందో అర్ధం కావడం లేదు. 300 మందికి పైగా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, వారి కుటుంబాలకు తగిన సాయం అందకపోవడం బాధాకరం. కనీసం కారుణ్య నియామకాలు కూడా చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. కార్మికుల డిమాండ్లు కేవలం వేతనాలకే పరిమితం కావు. అవి సంస్థను బలోపేతం చేసేవిగా ఉన్నాయి. 3 వేల పాత బస్సుల స్థానంలో కొత్తవి కొనాలి. మహిళా సిబ్బందికి సౌకర్యాలు, ఆరోగ్య పరీక్షలు, ప్రమాద బీమా అన్నీ కల్పించాలి. డ్యూటీలో ఉండగా మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించడం వారి సామాజిక భద్రతకు గ్యారెంటీ ఇస్తుంది. ఐదేళ్లకోసారి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలనే కోరిక డ్రైవర్ల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థలు లాభాపేక్షతో నడవవు. అది ప్రభుత్వ సామాజిక బాధ్యత. డీజిల్ ధరలు పెరిగినా, సబ్సిడీలు తగ్గినా కార్మికులు సంస్థను అంటిపెట్టుకుని కష్టకాలంలో దాన్ని నిలబెట్టారు. గత ఐదేళ్లలో సంస్థపై పడిన రూ.6,000 కోట్ల భారాన్ని కార్మికులు తట్టుకోగలిగారు. మరి ఇంతటి త్యాగనిరతి ఉన్న వ్యవస్థను ప్రైవేటీకరణ వైపు నెట్టడం ఎంతవరకు సమంజసం ? ప్రైవేట్ వ్యక్తుల లాభాల కంటే ప్రజల సౌకర్యమే ముఖ్యం అని ప్రభుత్వం గుర్తించాలి.సమ్మె జరిగితే రోజుకు 30 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడతారు. విద్యార్థులు, ఉద్యోగులు, రోగులు ప్రతి వర్గం ప్రభావితమవుతుంది. ‘ఆర్టీసీ బతకాలి…కార్మికుడు బతకాలి’ అనే నినాదం కేవలం మాటల్లో కాకుండా చేతల్లో కనిపించాలి. ప్రభుత్వం స్పందించి, ఆర్టీసీని గట్టెక్కిస్తేనే ప్రజా రవాణా భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.
సీనియర్ జర్నలిస్ట్ సెల్ : 9848559863



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *