అసమర్థ మంత్రికి మోదీ అభయ హస్తం


  • సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
  • దిల్లీలో సీజేపీ ఆందోళనకు సంఘీభావం
  • ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్

న్యూఢిల్లీ: పదేపదే పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు, దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న సంక్షోభానికి నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా సంఘీభావం తెలిపారు. నిష్పాక్షికంగా, విశ్వసనీయంగా పరీక్షలు నిర్వహించడంలో కేంద్రంలోని మోదీ సర్కారు పదేపదే విఫలమవుతుండటంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో నెలకొన్న ఆగ్రహానికి దేశ రాజధాని దిల్లీ వేదికగా వివిధ విద్యార్థి, యువజన సంఘాల మద్దతుతో సీజేపీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం… ప్రభుత్వ వైఫల్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆందోళనకారులను ఉద్దేశించి డి. రాజా మాట్లాడుతూ… కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ పదేపదే తన అసమర్థతను చాటుకున్నారని విమర్శించారు. అయినప్పటికీ ప్రధాని మోదీ ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించకుండా కాపాడుతున్నారని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తున్నారని, ఇకనైనా కేంద్ర ప్రభుత్వం వారి డిమాండ్‌ను ఆలకించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్, నేహా తదితర ఉద్యమకారులను డి.రాజా కలిసి సంఘీభావం తెలిపారు. నిరసన ప్రాంగణంలో ఏఐ‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు నిర్వహిస్తున్న ఉచిత మొబైల్ గ్రంథాలయాన్ని కూడా ఆయన సందర్శించారు. విద్య, విజ్ఞానం, ప్రజాస్వామ్య పోరాటం పట్ల విద్యార్థుల నిబద్ధతకు ఈ గ్రంథాలయం శక్తివంతమైన ప్రతీకగా నిలుస్తోందని ఆయన ప్రశంసించారు. డి.రాజాతో పాటు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, దిల్లీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ దినేష్ వర్షే ్న, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు వివేక్ శర్మ, ఏఐ‌ఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు విరాజ్ దేవాంగ్‌తో పాటు దిల్లీ రాష్ట్ర సీపీఐ నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

The post అసమర్థ మంత్రికి మోదీ అభయ హస్తం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *