డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఈరోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను భారీ భద్రత నడుమ కాకినాడకు తరలించారు. ఈ ప్రయాణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతబాబును ఒక్కరోజు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్లో అనంతబాబును ప్రత్యేక బృందం విచారిస్తోంది. ముఖ్యంగా హత్య జరిగిన రాత్రి అసలేం జరిగింది? సుబ్రహ్మణ్యాన్ని ఇంటి నుంచి ఎందుకు తీసుకెళ్లారు? హత్యకు దారితీసిన అసలు కారణాలు ఏంటి? అనే కీలక అంశాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సాక్షులను బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది. కస్టడీ ముగిసిన అనంతరం సేకరించిన సమాచారాన్ని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించనున్నారు.


