Pastor Abhinay: మూడు పెళ్లిళ్లు.. వరకట్న వేధింపులు.. పాడేరు డ్రామాతో బయటపడిన పాస్టర్ అభినయ్ అసలు బాగోతం.. చిన్న కథ కాదు..! Pastor Abhinay Darshan case | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)


Last Updated:

పాస్టర్ అభినయ్ దర్శన్ పై మూడు పెళ్లిళ్లు, వరకట్న వేధింపులు, మోసం, విరాళాల సేకరణ, నకిలీ దాడి నాటకం ఆరోపణలపై కేసులు, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు

+

News18

News18

పాడేరు ఏజెన్సీలో తనపై దాడి జరిగిందంటూ సంచలనం రేపిన పాస్టర్ అభినయ్ దర్శన్ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మొదట ముసుగు వ్యక్తుల దాడిగా ప్రచారం పొందిన ఈ ఘటన వెనుక అసలు కథ వెలుగులోకి వస్తుండగా.. పాస్టర్ అభినయ్ చుట్టూ తిరుగుతున్న వివాదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు, వరకట్న వేధింపులు, మహిళల మోసం, విరాళాల సేకరణ, రాజకీయ ప్రచారం వంటి అంశాలు ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారాయి.

కడపకు చెందిన అభినయ్ దర్శన్ ఎస్వీ యూనివర్సిటీ నుంచి యానిమేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 2011 మే 19న ప్రకాష్‌నగర్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో లక్షల రూపాయల నగదు, బంగారం కట్నంగా ఇచ్చినట్టు బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తర్వాత భార్యకు బ్యాంకు ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌కు వెళ్లిన అభినయ్.. సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయంటూ భార్యను నమ్మించి భారీగా లోన్లు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. భార్య పేరుతో తీసుకున్న అప్పులను వ్యక్తిగత విలాసాలకు ఖర్చు చేసి కుటుంబాన్ని ఆర్థికంగా కుదేలు చేశాడని తెలుస్తోంది.

తర్వాత తాను పూర్తిగా మారిపోయానంటూ పాస్టర్ అవతారం ఎత్తిన అభినయ్.. భార్య సహకారంతో మళ్లీ భారీ లోన్లు తీసుకుని వివిధ ప్రాంతాల్లో ప్రార్థనా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల పేరుతో తిరిగాడు. అయితే ఇదే సమయంలో అతని అసలు వ్యవహారాలు బయటపడడం ప్రారంభమయ్యాయి. అప్పటికే వివాహితుడైనా విజయవాడలో ఓ మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. ఆ వ్యవహారం పెద్దల జోక్యంతో ముగిసినప్పటికీ.. తర్వాత విజయనగరంలో మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని 2021లో ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నాడని పోలీసు రికార్డుల్లో నమోదైంది. దీంతో అభినయ్ మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ వ్యవహారాలు బయటపడిన తర్వాత మొదటి భార్య తీవ్ర ఆవేదనతో కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం వేధింపులు, మానసిక హింస, మోసం చేశాడంటూ కేసు నమోదు అయింది. 498-A, 494 IPC సెక్షన్లతో పాటు వరకట్న నిషేధ చట్టం కింద కూడా అభినయ్‌పై కేసులు నమోదయ్యాయి. మరోవైపు విజయనగరం యువతి కుటుంబాన్ని చంపేస్తానంటూ బెదిరించడం, వారి ఇంటి వద్ద హంగామా చేయడం, ఇనుప రాడ్డుతో గేట్లు కొట్టడం వంటి ఘటనలపై కూడా అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, భరోసా పార్టీ, చేంజ్ పీపుల్స్ ఫ్యూచర్ (CPF) పేర్లతో రాజకీయ, సామాజిక సంస్థలు నడుపుతున్న అభినయ్.. సోషల్ మీడియా ద్వారా క్రైస్తవుల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రతి ఒక్కరూ రూ.10 విరాళం ఇవ్వాలంటూ బ్యాంక్ ఖాతా వివరాలు షేర్ చేస్తూ డబ్బులు సేకరించినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇటీవల పాడేరు ఏజెన్సీలో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వ వ్యతిరేక వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారిన అభినయ్.. మే 18న తనపై దాడి జరిగిందంటూ ఆసుపత్రిలో చేరాడు. అయితే దర్యాప్తులో ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. కేవలం పబ్లిసిటీ కోసం డ్రామా ఆడాడా..? లేక రాజకీయంగా రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించే ప్రయగ్నమా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా పిఠాపురంలో రాష్ట్ర విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు దువ్వా వెంకటేశ్వరరావు.. మీడియో సమావేశం నిర్వహించి పాస్టర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంటువంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సమాజంలో అలజడులు సృష్టిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ పాస్టర్ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *